సార్వత్రిక సమ్మె మోదీకి హెచ్చరిక – Visalaandhra


పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా, డా.మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థికమంత్రిగా 1991లో అధికారంలోకి వచ్చీ రావడంతోటే ప్రైవేటీకరణకు పెద్దపీట వేసినట్టయింది. ఇది శ్రామిక వర్గానికి అనేక చిక్కులు తెచ్చిపెట్టింది. 100 నుంచి 150ఏళ్ల కాలం సుదీర్ఘ పోరాటం చేసి శ్రామికవర్గం సాధించుకున్న హక్కులకు క్రమంగా కోత పడడం మొదలైంది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శ్రమజీవుల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ విధానాలు పూర్తిగా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం కింద మారిపోయాయి. సకల ప్రభుత్వ విధానాలు అదాణీ, అంబానీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించడం మొదలైంది. సబ్ కా వికాస్, సబ్ కా సాథ్ అన్న మోదీ నినాదం కేవలం ఒకటి రెండు గుత్త వ్యాపార సంస్థల లాభాలు పెంచడమే ప్రభుత్వ పరమ లక్ష్యంగా తయారైంది. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బుధవారం అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ప్రారంభం అవుతోంది. దాదాపు 25 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా. కేవలం కార్మికులే కాక రైతులు, బ్యాంక్ ఉద్యోగులు, బీమా సంస్థ్ల సిబ్బంది కూడా సమ్మెలో భాగస్వాములు కానున్నారు. విద్యుత్ బిల్లు, విత్తనాలు, అణు ఇంధనానికి వ్యతిరేకంగానే కాక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పూర్వ రూపాన్ని పునరుద్ధరించాలన్న డిమాండు కూడా ఈ సమ్మెలో ప్రధానంగా ప్రతిధ్వనించనుంది. ఈ సమ్మె ప్రభావం కేవలం పట్టణ ప్రాంతాలకే కాక గ్రామీణ ప్రాంతాలలో కూడా స్పష్టంగా కనిపించే సూచనలున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందానికి కూడా వ్యతిరేక స్వభావాన్ని సంతరించుకుంది. ఈ ఒప్పందం కుదుర్చుకోవడంలో మోదీ అమెరికా ప్రభుత్వానికి సాష్టంగా పడ్డారు. సంపూర్ణంగా లొంగిపోయారు. దేశప్రయోజనాలను మంట గలిపారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ మొదలైన పది కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇచ్చాయి. వామపక్ష పార్టీలు ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి. ఈ సమ్మె విజయవంతంగా జరుగుతుందన్న ఆశ గట్టిగా ఉంది. దానితో కేంద్ర ప్రభుత్వానికి ఘాటైన హెచ్చరిక జారీ చేసినట్టవుతుంది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల శ్రమజీవుల బతుకు నానాటికీ దుర్భరంగా మారుతోంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన బడ్జెట్ మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా ఉంది. మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 1919-20లో తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలు కార్మికవర్గానికి ఉరితాళ్లుగా మారాయి. ఈ చట్టాల ప్రకారం చాలామంది శ్రమజీవులు “కార్మికులు” అన్న నిర్వచనం కిందకు రాకుండాపోయారు. దీంతో వారి అస్తిత్వమే ప్రమాదంలో పడింది. ఈ నాలుగు కార్మిక చట్టాలు తీసుకు రాకముందు ఉన్న చట్టాలు బ్రిటిష్ వలసవాదుల కాలం నుంచి మొదలుకుని, స్వాతంత్య్రానంతరం దాదాపు ఆరు దశాబ్దాల కాలంలో జరిగిన పోరాటాల ఫలితంగా దక్కిన హక్కులన్నింటిని హుష్ కాకి చేసేశాయి. నిజానికి ఈ నాలుగు చట్టాలూ రాజ్యాంగ విరుద్ధమైనవి. ఈ చట్టాలు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు, ప్రధానంగా వామపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకించాయి. కానీ ప్రతిపక్షాలు సభలో లేకుండా ప్రతిపక్ష సభ్యులందరినీ సభ నుంచి సస్పెండ్ చేసి తమకు కావలసిన చట్టాలను ఆమోదించే దుష్ట సంప్రదాయం మోదీ హయాంలో విచ్చలవిడిగా కొనసాగుతోంది. కార్మిక చట్టాలను కూడా ఇదే రీతిలో ఆమోదించేశారు. శ్రమజీవులకు రాజ్యాంగం ద్వారా అందుబాటులోకి వచ్చిన హక్కులను హరించే కుట్రలో భాగంగానే మోదీ ప్రభుత్వం వీటిని గుట్టుచప్పుడు కాకుండా దొంగచాటుగా ఆమోదించేసింది. ఈ సమ్మె ప్రభావం 600 జిల్లాల్లో కనిపించబోతోందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ అంటున్నారు. అంటే దేశమంతా స్తంభించిపోవడం ఖాయం. సమ్మె సన్నాహాల్లో విద్యార్థులు, యువత కూడా ఉత్సాహంగా పాల్గొంటోంది.
నాలుగు కార్మిక చట్టాలను వెనక్కు తీసుకోకపోతే ప్రజోద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అంటే అవసరమైతే వివిధ పోరాట రూపాలలో ప్రభుత్వంపై తిరగబడడానికి కార్మికవర్గం సిద్ధంగా ఉందన్న మాట. గత ఏడాది జులైలో జరిగిన సార్వత్రిక సమ్మెలోనూ 25 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు. ఈసారి మరో అయిదు కోట్ల మంది సమ్మె బాట పట్టొచ్చునని కార్మిక సంఘాలు ఆశిస్తున్నాయి. సహజంగానే వామపక్ష ఫ్రంట్ అధికారంలో ఉన్న కేరళలో సమ్మె ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించవచ్చు. ప్రజలంతా ఈ సమ్మెలో భాగస్వాములు అవుతారనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్ సంఘ్ తప్ప అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నాయి. ఇంతవరకు అమలులో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు చట్టాలతో కూడిన కార్మిక సంహితను అమలులోకి తేవడం మోదీ ప్రభుత్వ లక్ష్యం. స్వాతంత్య్రం తరవాత మన దేశంలో కార్మిక చట్టాలు అమలులోకి వచ్చాయి. న్యాయమూర్తి గజేంద్ర గడ్కర్ నేతృత్వంలోని మొదటి కార్మిక కమిషన్ సిఫార్సుల ఆధారంగా క్రమంగా ఒక్కో కార్మిక చట్టం రూపొందింది. గజేంద్ర గడ్కర్ కమిషన్ చేసిన సిఫార్సులు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ఆధారంగా రూపొందినవే.
అయితే బీజేపీ నాయకుడు అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడే కార్మిక అనుకూల అంశాలను హరించే ప్రయత్నం మొదలైంది. అప్పుడే రెండవ లేబర్ కమిషన్ ఏర్పాటు చేశారు. అప్పుడు కార్మిక సంఘాలన్నీ సమైక్యంగా ఎదిరించినందువల్ల కార్మిక చట్టాలను మార్చే ప్రయత్నం నెరవేరలేదు. పీవీ నరసింహారావు హయాంలోనే కార్మిక హక్కులను కాలరాసే ప్రయత్నం మొదలైంది. పెట్టుబడిదార్లు, బహుళజాతి గుత్త వ్యాపార సంస్థలకు అనుకూలమైన చట్టాలను రూపిందించడం మొదలైంది. 2014లో మోదీ అధికారంలోకి రావడంతో కార్మికవర్గం దాడి పెరుగుతూ పోయింది. బుధవారం అర్ధ రాత్రి ప్రారంభం అయ్యే సార్వత్రిక సమ్మెను కాంగ్రెస్, దానికి అనుబంధంగా ఉన్న ఐఎన్‌టీయూసీ సమర్థిస్తున్నప్పటికీ 2019లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన “వేతన సంహిత” ను కాంగ్రెస్ సమర్థించడం ఓ వైపరీత్యం. వామపక్ష పార్టీలు, డీిఎంÂకే దీన్ని గట్టిగా వ్యతిరేకించాయి. కార్మిక సంహిత అమలులోకి వచ్చినప్పటి నుంచి కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకోవడమే కష్ట సాధ్యమైపోయింది. తమిళనాడులో శాంసంగ్ కంపెనీ ఉద్యోగులు సంఘం ఏర్పాటు చేసుకుంటే దాన్ని గుర్తించడానికి నిరాకరించారు. రెండు నెలల పాటు ఆ కంపెనీ సిబ్బంది ఆందోళనకు దిగితే తప్ప ఆ యూనియన్‌ను రిజిస్టర్ చేయించడం కుదరలేదు. మోదీ పీఠం కదిలించడంలో ఈ సమ్మె కచ్చితంగా నిర్ణాయక పాత్ర పోషిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *