సరిపడా గ్యాస్ నిల్వలు


మరో 15 రోజుల వరకు ఢోకా లేదు
ప్రత్యామ్నాయాలపై దృష్టి
పెడుతున్నాం
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మరికొన్ని మెట్రిక్ టన్నులు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ నుంచి మంగళవారం కీలక సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ స్టాక్‌లు పెంచేలా చూడాలని ఆదేశించారు. గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంచి… మెరుగైన పంపిణీ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించే అంశంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీలోని కేజీ(కృష్ణా గోదావరి) బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్‌వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసేలా చూడాలని స్పష్టంచేశారు. సీఎన్జీ, పీఎన్జీల వినియోగాన్ని గరిష్ఠంగా పెంచే అవకాశాలను పరిశీలించాలని చంద్రబాబు సూచించారు. సమావేశానికి సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు హాజరయ్యారు.
త్వరలో ఏపీ వన్ యాప్ సేవలు
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పౌరుల భద్రతకు అవగాహన (సిటిజన్ సేఫ్టీ అవేర్‌నెస్) కింద సంక్షిప్త సమాచారాన్ని పంపించా లన్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు లింక్‌ను యాప్ ద్వారా లేదా వాట్సప్ గవర్నెన్సు ద్వారా వినియోగదారులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ‘ఏపీ వన్ యాప’ను త్వరితగతిన అందుబాటులోకి తేవాలన్నారు. వేసవిలో ‘అవేర’ ద్వారా సమాచారం తీసుకుని తాగునీరు, వాడగాడ్పులు, పశుగ్రాసం సహా వివిధ అంశాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహిళలపై నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టంచేశారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాలు సాధించేలా ప్రజల్లో విస్తృత మార్పు తెచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. గ్రామాల్లో వ్యర్ధాలు తొలగించి చెత్తను వర్గీకరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. భవన నిర్మాణాల నుంచి వచ్చే వ్యర్ధాలను సర్క్యులర్ ఎకానమీకి వెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, ఐఅండఐ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పంచాయతీరాజ్, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, సురేశ్ కుమార్, దేవాదాయశాఖ కార్యదర్శి హరిజవహర్ లాల్, వివిధ పెట్రోలియం కంపెనీలు, గెయిల్, ఓఎన్జీసీ ప్రతినిధులు హాజరయ్యారు.

The post సరిపడా గ్యాస్ నిల్వలు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *