శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా!


సినిమా: ఒక దర్శకుని వద్ద శిక్షణ పొందిన వారంతా విభిన్న కథలతో విజయాలు అందుకోవడం విశేషం. అగ్ర దర్శకుల్లో ఒకరైన సుకుమార్‌కు ఇది వర్తిస్తుంది. ఆయన వదిలిన కొత్త బాణం హుస్సేన్ షా కిరణ్ ‘మృత్యుంజయ’ తో హిట్ కొట్టడంతో టాలీవుడ్.. ‘శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా’ అంటోంది. సుకుమార్ శిష్య బృందంలో పల్నాటి సూర్య ప్రతాప్ ఒకరు. ‘కరెంట’తో దర్శకుడిగా పరిచయమైన తర్వాత సుకుమార్‌తో ప్రయాణించారు. ఆ క్రమంలో తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా ‘కుమారి 21 ఎఫ’తో గుర్తింపు పొందారు. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ‘18 పేజెస’తో థ్రిల్ చేశారు. ఈ రెండు చిత్రాలకు సుకుమారే కథ అందించడం గమనార్హం. ఊహించలేని ట్విస్టుతో ప్రేమకథ ‘ఉప్పెన’ను తెరకెక్కించి, అందరి దృష్టి ఆకర్షించారు దర్శకుడు బుచ్చిబాబు. ఈ రొమాంటిక్ డ్రామా మూవీ ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. తొలి సినిమాకి భిన్నంగా ఇప్పుడు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ తెరకెక్కిస్తున్నారు బుచ్చిబాబు. రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ‘దసరా’తో సత్తా చాటిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూ సుకుమారే గురువు. నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పుడిదే కాంబినేషన్‌లో.. అంతకుమించిన యాక్షన్‌తో ‘ది ప్యారడైజ’ రూపొందుతోంది. ఈ చిత్రం ఆగస్టు 21న రిలీజ్ కానుంది. హారర్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’తో ఓ కొత్త అనుభూతి పంచిన కార్తీక్ దండు.. సుకుమార్ శిష్యుడే. ఇప్పుడాయన.. నాగచైతన్య హీరోగా ‘వృషకర్మ’ తెరకెక్కిస్తున్నారు. ఇదొక మైథలాజికల్ థ్రిల్లర్. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ‘మృత్యుంజయ’ ఈ నెల 6న బాక్సీఫీసు ముందుకొచ్చి, ప్రేక్షకాదరణ దక్కించుకుంది. తన స్కూల్‌లో ఉన్నంత వరకు మాత్రమే కాదు.. దర్శకులుగా మారిన తర్వాత కూడా వారిని సుకుమార్ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. తన స్టూడెంట్స్ రాసుకున్న కథలకు సంబంధించి సలహాలిస్తుంటారు. దాంతోపాటు ఆయా చిత్రాల నిర్మాణ సంస్థలతో కలిసి తానూ వాటిని నిర్మిస్తుంటారు. ‘దసరా’, ‘మృత్యుంజయ’ మినహా మిగతా చిత్రాలన్నింటికీ ఆయన కూడా ఓ నిర్మాత కావడం గమనార్హం. ప్రేక్షకులు మెచ్చే, నచ్చే సినిమాలు తీసి, శభాష్ అనిపించుకుంటున్నారు సుకుమార్ శిష్యగణం.

The post శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా! appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *