. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలేనంటూ విమర్శలు
. అనంతరం వాకౌట్ చేసిన సభ్యులు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనలతో శాసన సభ దద్దరిల్లింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రదర్శనగా అసెంబ్లీకి వచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, కుప్పకూలిన శాంతిభద్రతలపై నిలదీయనివ్వరు అనే ప్లకార్డును పట్టుకుని ఆయన తన పార్టీ సభ్యులతో సభకు హాజరయ్యారు. ఉభయసభల నుద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభించగానే, వైసీపీ సభ్యులు సభలో లేచి నిలబడి నిరసన తెలిపారు. ఫ్లకార్డులు పట్టుకుని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నినాదాలు చేశారు. కూటమి పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై కచ్చితంగా గళం వినిపిస్తామన్నారు. అనంతరం సభలో గవర్నర్ ప్రసంగంపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌తో కూడా అబద్ధాలు చెప్పించడం బాధాకరమని అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు… రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు… అంటూ నినాదాలు చేశారు. తిరుమల లడ్డూపై తప్ప్పుడు ప్రచారాన్ని నిలిపివేయాలని, సభ్యుల హక్కులను కాపాడాలని, వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను గవర్నర్ చదువుతున్నారంటూ ఆరోపించారు. తన ప్రసంగంలో చదువుతున్నది వాస్తవమా కాదా అని కూడా గవర్నర్ చూడటం లేదని, రూ.3.2 లక్షల కోట్లు అప్ప్పులు చేసి ఎవరికిచ్చారు? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరి నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం, సభను వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు.
11 మంది 11 నిముషాలున్నారు
దీనిపై అసెంబ్లీ లాబీలో మీడియాతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభకు హాజరయి కాసేపు నిరసన తెలిపి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో స్పీకర్ స్పందిస్తూ 11వ తేదీన 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారు… అంతకుమించి ఎక్కువ సమయం లేరుగా!’ అని వ్యాఖ్యానించారు. సభ్యులు సభా సంప్రదాయాలను పాటిస్తే మంచిదని స్పీకర్ అన్నారు.


