వైభవంగా సింహాద్రినాథుడి సోదరి సత్తెమ్మ తల్లి జాతర.. ఘనంగా సారె ఊరేగింపు..! Devotion at Sri Sattemma Talli Maridimamba Ammavari Jathara | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖలో శ్రీ సత్తెమ్మ తల్లి మరిడిమాంబ అమ్మవారి జాతర సందర్భంగా భక్తి పరవశం నెలకొంది. 14 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నైవేద్యాలు సమర్పించారు.

News18
News18

విశాఖలోని సింహాద్రినాథుడి సోదరిగా, గ్రామాల పొలిమేర దేవతగా విశ్వసింపబడుతున్న శ్రీ సత్తెమ్మ తల్లి మరిడిమాంబ (Sri Sattemma Thalli Maridimamba) అమ్మవారి వార్షిక జాతర సందర్భంగా భక్తి పరవశం నెలకొంది. శ్రీనివాస్ నగర్ పరిసర ప్రాంతాలకు చెందిన 14 గ్రామాల ప్రజల ఆరాధ్య దేవతగా విరాజిల్లుతున్న అమ్మవారి పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సారె ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తూ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు.

శ్రీనివాస్ నగర్ ప్రాంతంలోని అమ్మవారి ఆలయ పరిసరాల్లో సారె ఊరేగింపు ఎంతో ఘనంగా జరిగింది. భక్తులు తమ ఇళ్ల నుంచి తీసుకువచ్చిన వివిధ రకాల పిండి వంటలు, నైవేద్యాలతో అమ్మవారికి ప్రత్యేక సమర్పణలు చేశారు. ఊరంతా భక్తి వాతావరణంతో నిండిపోగా మహిళలు, యువత, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షులు పి.వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు.

గ్రామ పొలిమేరల్లో నిరంతరం కాపలా కాస్తూ ప్రజలను దుష్టశక్తుల నుంచి రక్షించే దేవతగా సత్తెమ్మ తల్లి మరిడిమాంబ అమ్మవారు ఎంతో ప్రాచుర్యం పొందారని భక్తులు విశ్వసిస్తున్నారు. అందుకే ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతరలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లిస్తుంటారు. ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జాతరను మరింత ఘనంగా మార్చారు.

సారె ఊరేగింపుకు ముందు అమ్మవారికి ప్రత్యేకంగా నివేదన కార్యక్రమాలు నిర్వహించారు. విశేష అభిషేకం, పంచహారతి సేవ, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద సేవ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో ఆలయ పరిసర ప్రాంతం అంతా భక్తి వాతావరణంతో నిండిపోయింది. భక్తులు పసుపు, కుంకుమలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

ఇక ప్రధాన ఉత్సవం శనివారం తెల్లవారుజామున ప్రారంభం కానుంది. అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ధూపదీప నైవేద్యాలు, కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

భక్తుల కోసం ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ప్రసాద వితరణతో పాటు మధ్యాహ్నం అన్నసమారాధన కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేశారు. భక్తులంతా అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించి పొలిమేర దేవత ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు కోరారు. అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రావు, గంట్ల కనకరాజు, బలిరెడ్డి శ్రీనివాసు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *