Last Updated:
వేసవిలో చల్లని నీటి కోసం పలమనేరు టెర్రకోట మట్టి కుండలు ప్రజాదరణ పొందుతున్నాయి. టెర్రకోట కేంద్రం 40 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ, దేశ, విదేశాలకు ఎగుమతులు చేస్తోంది.
వేసవి కాలం మొదలవుతూనే చల్లని నీటి కోసం మట్టి కుండల డిమాండ్ భారీగా పెరుగుతుంది. ప్లాస్టిక్, స్టీల్ పాత్రలు ఉన్నప్పటికీ మట్టి కుండలో నిల్వ చేసే నీటికి ఉండే చల్లదనం ప్రత్యేకం. అందుకే వేసవి తాపాన్ని తగ్గించే ఈ సంప్రదాయ మట్టి కుండలు ఇప్పటికీ ప్రజల ఆదరణ పొందుతున్నాయి. అటువంటి నాణ్యమైన మట్టి కుండలు తక్కువ ధరకే లభించే కేంద్రంగా చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం పేరు తెచ్చుకుంది.
బెంగళూరు–చెన్నై జాతీయ రహదారి పక్కన ఉన్న గంటావూరు కాలనీలో డి.ఆర్.డి.ఏ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టెర్రకోట కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కుమ్మరుల జీవనోపాధి మెరుగుపరచడం, వారి సంప్రదాయ వృత్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా సుమారు రూ.2 లక్షల వ్యయంతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఇక్కడ తయారయ్యే మట్టి కుండలు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని టెర్రకోట ఇన్చార్జ్ వెంకటేష్ తెలిపారు.
ఇక్కడ తయారు చేసే మట్టి పాత్రలు ధర పరంగా కూడా అందుబాటులో ఉంటాయి. చిన్న కుండలు రూ.100 నుంచి ప్రారంభమవుతుండగా పెద్ద కుండలు రూ.500 వరకు లభిస్తాయి. సింగిల్‌గా కావాలన్నా, బల్క్‌గా కావాలన్నా కొనుగోలు చేయవచ్చని టెర్రకోట సిబ్బంది శ్రీకాంత్ తెలిపారు. చిన్న బాటిళ్ల నుంచి పెద్ద కడవల వరకు సుమారు 200 రకాల మట్టి పాత్రలు ఇక్కడ తయారవుతుండటం ప్రత్యేకత.
ఈ టెర్రకోట కేంద్రం ప్రస్తుతం సుమారు 40 కుటుంబాలకు జీవనాధారంగా మారింది. మట్టి పాత్రల తయారీలో ఆసక్తి ఉన్నవారికి ఇక్కడ ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. పలమనేరు పరిసర ప్రాంతాల్లోని చెరువుల నుంచి సేకరించిన మట్టిని శుద్ధి చేసి, యంత్రాల సాయంతో సిద్ధం చేసి, తరువాత చేతిపనితోనే అందమైన పాత్రలుగా మలుస్తారు. వాటిని బట్టీలో కాల్చి బంగారు వర్ణం వచ్చే వరకు వేడి చేసి మార్కెట్‌కు సిద్ధం చేస్తారు.
ఇక్కడ తయారయ్యే కుండలు నాణ్యత, అందం కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద నగరాల వరకు విస్తృతంగా అమ్ముడవుతున్నాయి. హైవే పక్కన ఉండటంతో రవాణా సౌకర్యం సులభంగా ఉండి దేశంలోని అనేక ప్రాంతాలకు సరఫరా జరుగుతోంది. విదేశాలకు కూడా ఎగుమతులు జరగడం వల్ల పలమనేరు టెర్రకోటకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఇక్కడ తయారు చేసిన కొన్ని కళాఖండాలు ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కూడా ప్రదర్శించబడ్డాయి. వాటిని చూసి ప్రశంసించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కళాకారులను ఆహ్వానించారని స్థానికులు చెబుతున్నారు. నేటికీ ఎర్రకోటలో ఉన్న ఆరు కళాఖండాలు పలమనేరు టెర్రకోటకు చెందినవేనని వారు గర్వంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ టెర్రకోటను నమ్ముకుని పనిచేస్తున్న కుటుంబాలు రోజుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు సంపాదిస్తూ సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి.
వేసవిలో చల్లని నీటి కోసం మట్టి కుండలు కొనాలనుకునే వారు పలమనేరు టెర్రకోటను సంప్రదిస్తే తక్కువ ధరకే నాణ్యమైన పాత్రలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. సంప్రదాయాన్ని కాపాడుతూ ఉపాధిని అందిస్తున్న ఈ టెర్రకోట కేంద్రం ఇప్పుడు పలమనేరు పట్టణానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh


