Last Updated:
విజయనగరం డాక్టర్ ఆనందరావు హెచ్చరిక, ఎండల్లో డీహైడ్రేషన్ వడదెబ్బ ప్రమాదం, వృద్ధులు మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దని సూచన, నీరు మజ్జిగ పండ్లరసం తాగమని సలహా
ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో.. వేసవికాలంలో సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం ఆయుర్వేదిక్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆనందరావు సూచించారు. ముఖ్యంగా ఈ కాలంలో ఎక్కువగా కనిపించే సమస్య డీహైడ్రేషన్ అని తెలిపారు. ఇది స్వతంత్ర జబ్బు కాకపోయినా, అధిక వేడి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల ఏర్పడే ప్రమాదకర పరిస్థితి అని తెలిపారు.
వేసవిలో అధికంగా చెమట పట్టడం వల్ల శరీరంలోని నీరు, లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. దీంతో శరీరంలో వాటర్ బ్యాలెన్స్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ దెబ్బతింటాయి. ఫలితంగా బలహీనత, అలసట, తల తిరగడం, నోరు ఎండిపోవడం, మూత్రం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, ఎండలో ఎక్కువసేపు పనిచేసేవారు ఎక్కువ ప్రమాదంలో ఉంటారని తెలిపారు.
ముఖ్యంగా 55 సంవత్సరాలు దాటిన వారు అవసరం లేకపోతే మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం 4:30 గంటల తర్వాత మాత్రమే వెళ్లాలని చెప్పారు. ఇలా చేస్తే వడదెబ్బ బారిన పడే అవకాశాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
వడదెబ్బ తగిలినప్పుడు వ్యక్తికి కళ్లు తిరగడం, ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, వాంతులు రావడం, బలహీనత కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. అలాంటి సందర్భంలో బాధితుడిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాలని సూచించారు. తడి గుడ్డతో ముఖం, శరీరాన్ని తుడవడం, బిగుతుగా ఉన్న దుస్తులను సడలించడం, గాలి బాగా ఆడేలా చూడడం వంటి ప్రాథమిక చర్యలు తీసుకోవాలని వెల్లడి చేశారు. వెంటనే ఓఆర్ఎస్ ద్రావణం ఉంటే ఇవ్వడం ద్వారా శరీరంలో నీరు, లవణాల లోటును కొంతవరకు భర్తీ చేయవచ్చని తెలిపారు.
వృద్ధులు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు, మంచినీరు, మజ్జిగ వంటి వాటిని వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడంలో, నీటి లోటు రాకుండా కాపాడడంలో సహాయపడతాయని చెప్పారు. వేసవిలో సాధారణంగా కనిపించే ఇతర వ్యాధుల్లో టైఫాయిడ్ ఫీవర్, యూరిన్ ఇన్ఫెక్షన్లు కూడా ముఖ్యమని డాక్టర్ ఆనందరావు తెలిపారు. తగినంత నీరు తాగకపోవడం వల్ల మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే పరిశుభ్రత లేని ఆహారం, కలుషిత నీరు తీసుకోవడం వల్ల టైఫాయిడ్ వంటి జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అందువల్ల వేసవికాలంలో బయట ఆహారం తినడం తగ్గించి, ఇంట్లో తయారుచేసిన తాజా ఆహారం తీసుకోవడం మంచిదన్నారు. ఎక్కువగా నీరు, కొబ్బరి నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలని సూచించారు. శరీరానికి తగినంత ద్రవాలు అందితే వేసవి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే వేసవి కాలాన్ని ఆరోగ్యంగా గడపవచ్చని డాక్టర్ ఆనందరావు సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Vizianagaram,Andhra Pradesh


