ఒక వ్యక్తి కాలు కోల్పోయిన ఘటన
విశాలాంధ్ర వెంకటగిరి
పట్టణంలోని ఒక ఆర్ఎంపీ (గ్రామీణ) వైద్యుడి నిర్లక్ష్య వైద్యం కారణంగా ఒక వ్యక్తి తన కాలును కోల్పోయినట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. చిన్నపాటి గాయాలకు రక్తస్రావం ఆపేందుకు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే అందించాల్సిన గ్రామీణ వైద్యులు, తమ పరిధిని దాటి సర్జరీలకు పాల్పడుతున్నారని స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటగిరికి చెందిన ఒక వ్యక్తికి జరిగిన ప్రమాదకర గాయానికి సరైన వైద్య చికిత్స అందించకుండా, ఫస్ట్ ఎయిడ్ పేరుతో అర్ధం తెలియని చికిత్స అందించారని ఆరోపణలు ఉన్నాయి.వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆ గాయం మెడికో-లీగల్ కేసు పరిధిలోకి వచ్చే ప్రమాదకర గాయంగా భావించబడుతున్నప్పటికీ, సంబంధిత ఆర్ఎంపీ వైద్యుడు రోగికి అనువుకాని మందులను పిచ్చి పుల్కా వ్రాతలతో అనువుగాని మందులను (Contraindicated drugs) ఒక ప్రిస్క్రిప్షన్ రూపంలో ఇవ్వడంతో పాటు, ఆ గాయానికి తగని విధంగా కుట్లు వేసి పరిస్థితిని మరింత దిగజార్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గాయం మరింత సంక్లిష్టమై, చివరకు రోగి కాలు పూర్తిగా పనికిరాకుండా పోయి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిసింది.
ఇలాంటి గాయాలకు సాధారణంగా తిరుపతిలోని ప్రసిద్ధ రుయా ఆసుపత్రి వంటి ప్రఖ్యాత వైద్య సంస్థల్లో ప్లాస్టిక్ సర్జరీ వంటి ప్రత్యేక చికిత్స అవసరం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే బాధితుడికి సరైన సమయంలో నిపుణుల వైద్యం అందకపోవడం వల్లే ఈ దురదృష్టకర పరిణామం చోటు చేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు.
The post వెంకటగిరిలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం appeared first on Visalaandhra.


