Last Updated:
రంజాన్ మాసంలో విశాఖలోని కే ఏ పాల్ ఫంక్షన్ హాల్లో షేక్ జుబేర్ నిర్వహణలో ప్రత్యేక హలీం తయారీ కేంద్రం ఏర్పాటైంది, ప్రజలు హలీం రుచిని ఆస్వాదిస్తున్నారు.
రంజాన్ మాసం ప్రారంభమైతే ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాసదీక్షలతో నెలంతా ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. ఉపవాస దీక్ష అనంతరం శక్తినిచ్చే ఆహారంగా హలీం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఒకప్పుడు హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన హలీం ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరించి ప్రజాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలోని కే ఏ పాల్ ఫంక్షన్ హాల్ ఆవరణలో ప్రత్యేకంగా హలీం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముస్లింలతో పాటు నగరవాసులు కూడా రుచి చూసేలా హలీం అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకుడు షేక్ జుబేర్ తెలిపారు.
హలీం తయారీ ఎంతో శ్రమతో కూడుకున్న ప్రక్రియ అని నిర్వాహకులు చెబుతున్నారు. ఒకే రోజు అమ్మే హలీం కోసం అర్ధరాత్రి 12 గంటలకే పనులు ప్రారంభమవుతాయి. చికెన్, మటన్ ముక్కలను శుభ్రపరచి బాగా ఉడికించి, వాటితో పాటు బాదం, పిస్తా, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌తో పాటు పలు రకాల పప్పుదినుసులను కలిపి ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. శక్తిని పెంచే పదార్థాలతో పాటు వట్టివేరు, పలు వనమూలికలు, గులాబీ రెక్కలు వంటి పదార్థాలను కూడా కలిపి పోషక విలువలను పెంచుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అన్ని పదార్థాలు సిద్ధమైన తర్వాత పెద్ద మట్టిబట్టిలో పాత్రలు పెట్టి చికెన్, మటన్ మిశ్రమాన్ని లేయర్లుగా వేసి ప్రత్యేక విధానంలో కలుపుతారు. హలీం మెత్తగా మారేందుకు రెండు నుంచి మూడు గంటల పాటు కర్రతో నిరంతరం కొట్టడం జరుగుతుంది. అనంతరం మరో రెండు గంటల పాటు మగ్గించడంతో సాంప్రదాయ రుచితో మెత్తటి హలీం సిద్ధమవుతుంది. మొత్తం ప్రక్రియకు దాదాపు పది గంటల సమయం పడుతుందని నిర్వాహకుడు జుబేర్ తెలిపారు.
ఇంత కష్టపడి తయారు చేసిన హలీం సాయంత్రం సమయానికి అందుబాటులోకి వస్తుంది. ఉపవాస దీక్ష విరమించిన తర్వాత హలీం తిన్న ముస్లిం సోదరులు, నగరవాసులు రుచి చాలా బాగుందని చెప్పినప్పుడు రోజు చేసిన కష్టం అంతా మరిచిపోతామని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ సమయంలో హలీంకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
ఈ హలీం కేంద్రంలో మటన్ హలీం స్మాల్ ప్యాక్ రూ.200, మీడియం రూ.380, ఫ్యామిలీ ప్యాక్ రూ.680గా ధరలు నిర్ణయించారు. అలాగే చికెన్ హలీం స్మాల్ ప్యాక్ రూ.130, మీడియం రూ.250, ఫ్యామిలీ ప్యాక్ రూ.400గా అందుబాటులో ఉంచారు. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హలీం విక్రయాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. రంజాన్ మాసంలో విశాఖలో హలీం రుచిని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


