Last Updated:
విశాఖపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు ఫేక్ మెయిల్ రావడంతో పోలీసులు, బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజాగా అనంతపురంలో కలకలం రేపిన బాంబు బెదిరింపు మెయిల్ ఘటన మరువకముందే.. విశాఖపట్నంలో మరోసారి అలాంటి ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కోర్టు వ్యవస్థలతోనే ఆటలాడుతున్న ఆకతాయిలు వరుసగా ఫేక్ మెయిల్స్ పంపిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. బాంబు పేలుతుందని సమయం కూడా పేర్కొంటూ పంపుతున్న ఈ బెదిరింపు మెయిల్స్ కారణంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చివరికి ప్రతిసారి అవి ఫేక్ మెయిల్స్‌గా తేలుతున్నా, ప్రతి సారి అధికారులు గంటల కొద్దీ తనిఖీలు నిర్వహించాల్సి వస్తోంది.
తాజాగా విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. ఉదయం 11.50 గంటలకు బాంబు పేలుతుందని హెచ్చరిక రావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఏ క్షణంలోనైనా ప్రమాదం సంభవించవచ్చన్న అనుమానంతో పోలీసులు హడావుడిగా కోర్టు పరిసర ప్రాంతాలకు చేరుకుని తనిఖీలు ప్రారంభించారు.
ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రెండవ పట్టణ ఎస్సై ఎర్రమనాయుడు సిబ్బందితో కలిసి బాంబు స్క్వాడ్ మరియు స్నిఫర్ డాగ్ సహాయంతో కోర్టు భవనం మొత్తం పరిశీలించారు. కోర్టు ప్రాంగణం చుట్టుపక్కల ఉన్న వాహనాలను కూడా ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువుల కోసం ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలించారు.
సమయానికి ముందుగానే చేరుకున్న పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినప్పటికీ ఎక్కడా బాంబు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో ఈ బెదిరింపు మెయిల్ కూడా ఫేక్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇటువంటి బెదిరింపులను పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
అనుకోని పరిస్థితుల్లో నిజంగా బాంబు పేలుడు వంటి ఘటనలు జరిగితే ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి తెలిపారు. ఆరోగ్య సేవల పరంగా డీఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బందిని సిద్ధంగా ఉంచామని, అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైర్ సర్వీసు సిబ్బంది వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ప్రజల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఇటీవల విశాఖపట్నంలో వరుసగా ఇలాంటి ఫేక్ మెయిల్స్ వస్తుండటంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సమాచారం నిజమో కాదో తెలుసుకోవడం తమ బాధ్యతగా భావించి ఘటనా స్థలాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం లక్ష్యంగా కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి మెయిల్స్ పంపుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఫేక్ మెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ ఎక్కడి నుంచి పంపబడింది, ఎవరు పంపించారు అన్న విషయాలను సాంకేతికంగా విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో విశాఖలో బాంబు బెదిరింపులు ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


