విశాలాంధ్ర-రాప్తాడు : ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతోపాటు పారిశ్రామిక సంస్థలను సందర్శించి అందులో ఉత్పత్తి అయ్యే వాటిపై కూడా అవగాహన పెంచుకోవాలని కళాశాల ఎం.డి. వెన్నెపూస రమాకాంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి. విష్ణువర్ధన్ సూచించారు.
హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు బుక్కరాయసముద్రం పరిధిలోని 220కేవీ, 132కేవీ, 33కేవీ, 11కేవీ సబ్స్టేషన్లను సందర్శించారు. కళాశాల కరస్పాండెంట్ వి.బి.ఆర్. శర్మ, చైర్మన్ బి.వి. కృష్ణా రెడ్డి, వైస్ చైర్మన్ వెన్నెపూస రవీంద్ర రెడ్డి గారి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ పారిశ్రామిక సందర్శనలో విద్యార్థులు విద్యుత్ వ్యవస్థలపై ప్రత్యక్ష అవగాహన పెంపొందించుకున్నారు.
ఈ సందర్భంగా సబ్స్టేషన్ డి.ఇ. వెంకట రమణ విద్యార్థులకు ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, భారీ ట్రాన్స్ఫార్మర్ల పనితీరు మరియు రక్షణ వ్యవస్థల గురించి వివరించారు. విద్యుత్ సరఫరాలో పాటించాల్సిన భద్రతా నియమాలను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు ఇటువంటి క్షేత్రస్థాయి పర్యటనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ కె. జ్యోతి, అడ్మిషన్స్ డైరెక్టర్ డి. షేక్షావలి, అధ్యాపకుడు దండు శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు.


