కాకినాడ, తూర్పు గోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా లోవ కొత్తూరు కొండకోన అటవీ ప్రాంతంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయం ఒక ప్రత్యేక ఆచారానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ వాహనాల నంబర్లను ఆలయం చుట్టూ ఉన్న రాళ్లపై, గోడలపై రాస్తుంటారు. ఈ సంప్రదాయం వెనుక ఒక అద్భుతం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ దేవత కొంగు బంగారు తల్లిగా కొలుస్తారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ధారాతీగ కొండల మధ్య ఈ అమ్మవారు స్వయంభుగా వెలసింది. ఆలయానికి వెళ్లే దారి, చుట్టుపక్కల ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
భక్తులు వాహన పూజలతో పాటు, తమ ద్విచక్ర వాహనం, కారు లేదా బస్సు నంబర్లను ఇక్కడ రాస్తుంటారు. గతంలో కొండలపై మాత్రమే కనిపించిన ఈ నంబర్లు ఇప్పుడు ఆలయ గోడల వరకు చేరాయి. ఇటీవల ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ, భక్తులు ఖాళీగా కనిపించే చోటల్లా తమ వాహనాల నంబర్లను రాస్తూనే ఉన్నారు. తమ కోరికలు, ప్రేమ వంటి విషయాలను కూడా రాసి వెళుతుంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో వాహన సంబంధిత సమస్యలు ఉండవని భక్తులు నమ్ముతున్నారు.
దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు పెయింట్, బ్రష్ తెచ్చుకుని కొండలపై నంబర్లు రాస్తుంటారు. ఈ ఆచారం సంస్కృతిలో భాగమని కొందరు భావిస్తుండగా, మరికొందరు గోడలు పాడు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దేవస్థానం కూడా భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది.


