Last Updated:
తుని నర్సీపట్నం రహదారిపై మరువాడ గ్రామంలో రైతు నానాజీ సాగు చేసిన సొంటి గులాబీలు ఐదు నుంచి ఏడు రోజులు తాజా ఉండి, పూజా మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌గా మారాయి.
గులాబీలంటే ఇష్టం లేని వారు ఉండరనే చెప్పాలి. పూజలైనా, అలంకరణైనా గులాబీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే సాధారణంగా గులాబీలు ఒక రోజు గడిచేలోపే రేకులు ఊడిపోవడం, రంగు మారిపోవడం లేదా వాడిపోవడం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చిన ఒక ప్రత్యేక రకం సొంటి గులాబీ మాత్రం ఐదు నుంచి ఏడు రోజుల వరకు వికసిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎక్కువ కాలం తాజాగా ఉండటంతో ఈ గులాబీలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది.
కాకినాడ జిల్లా పరిధిలో తుని నర్సీపట్నం రహదారిపై ఉన్న మరువాడ గ్రామ శివారులో రైతు నానాజీ ఈ ప్రత్యేక గులాబీల సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మొదట ఈ రకం పువ్వులు మార్కెట్‌లో కనిపించడంతో ఆసక్తి కలిగి వాటి మొక్కలను తెప్పించి ప్రయోగాత్మకంగా నాటారు. పువ్వులు బాగా పూయడం, రేకులు ఊడిపోకుండా ఎక్కువ రోజులు నిలవ ఉండటంతో సాగును విస్తరించాలని నిర్ణయించుకున్నారు.
మధ్యవర్తి సహాయంతో బెంగళూరు నుంచి సుమారు 500 మొక్కలను ఒక్కొక్కటి రూ.35 చొప్పున కొనుగోలు చేసి తోటను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ప్రతిరోజూ 4 వేల నుంచి 6 వేల వరకు పువ్వులు దిగుబడి వస్తున్నాయని రైతు చెబుతున్నారు. మార్కెట్‌లో ఈ గులాబీలకు మంచి స్పందన ఉండటంతో వ్యాపారులు ముందుగానే బుకింగ్స్ చేసుకుంటున్నారని తెలిపారు.
సాధారణ గులాబీలతో పోలిస్తే ఈ సొంటి గులాబీలు వెడల్పుగా, దట్టమైన రేకులతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ముఖ్యంగా పూజా కార్యక్రమాలు, ఆలయ అలంకరణ, ప్రత్యేక దినాల్లో ఈ పువ్వులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. గురువారం రోజున బాబా పూజలు, భక్తి కార్యక్రమాల కోసం గోదావరి జిల్లాల్లో భారీగా అమ్ముడవుతున్నాయని రైతు నానాజీ వెల్లడించారు.
రైతుల వద్ద కేజీకి రూ.100 నుంచి రూ.200 మధ్య ధరకు విక్రయిస్తుండగా, రిటైల్ మార్కెట్‌లో వ్యాపారులు మరింత ధరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ రోజులు తాజాగా ఉండటం, అందమైన ఆకారం, గట్టిగా నిలిచే రేకులు ఈ మూడు కారణాల వల్లే ఈ సొంటి గులాబీలు ఇప్పుడు పూజా మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌గా మారాయి. ఒకసారి చూసిన వారు మళ్లీ ఇవే కొనాలనుకునేలా ఈ పువ్వులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


