. సామ్రాజ్యవాదం అభివృద్ధి నిరోధకం
. కమ్యూనిస్టులు లేరనే వారికి భవిష్యత్తే సమాధానం
. రెడ్‌బుక్ డే సభలో వక్తలు
విశాలాంధ్ర-విజయవాడ:సామ్రాజ్యవాద దోపిడీదారుల నియంతత్వ పోకడలను అడ్డుకునేందుకు వామపక్ష సాహిత్యం ప్రపంచానికి అత్యవసరమని వక్తలు స్పష్టంచేశారు. విజయవాడలోని లెనిన్ విగ్రహం వద్ద విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ప్రజాశక్తి బుక్ హౌస్ సంయుక్త అధ్వర్యంలో రెడ్‌బుక్ డే కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు వీక్షకులను ఆలోచింపజేశాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ తదితర వామపక్ష పార్టీల నాయకులు కమ్యూనిజం మేనిఫెస్టో ప్రతులు ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం విశాలాంధ్ర విజ్ఞాన సమితి డిప్యూటీ జనరల్ మేనేజర్ టి.మనోహర్‌నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో సాహిత్యవేత్త గోళ్ల నారాయణరావు అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వామపక్ష, అభ్యుదయవాదులు, ప్రపంచమేధావులు రెడ్‌బుక్ డే పుస్తకాల ఆవిష్కరణల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 78 వేల కేంద్రాలలో ఇవి నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు. విజయవాడలో విశాలాంధ్ర, ప్రజాశక్తి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం శుభపరిణామన్నారు. కమ్యూనిస్టు మేనిఫెస్టోను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈశ్వరయ్య సూచించారు. రెడ్‌బుక్ సిద్ధాంతాలు సామాజిక న్యాయానికి మార్గం చూపుతాయని, దీంతో అసమానతలు లేని సమ్పుా నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఈ భావజాలం ప్రపంచంలో ఉన్నతమైనదని మేధావులు భావిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. వామపక్ష విప్లవాత్మక సాహిత్యాన్ని, కమ్యూనిస్టు మేనిఫెస్టోను భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందన్నారు. కమ్యూనిజం, లెనిన్ భావజాలం ఈ ప్రపంచానికి అవసరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రెడ్‌బుక్ కోట్లాదిమంది ప్రజలు కొనుగోలు చేసి… అభ్యుదయ భావజాలాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని మాట్లాడేవారికి సోషలిజం, కమ్యూనిజం విజ్ఞానాన్ని అందిద్దామన్నారు. ఆధిపత్యం పెరుగుతున్న నేటి రోజుల్లో అభ్యుదయ భావజాలం ఉన్న ఈ పుస్తకాన్ని సమాజానికి అందించాలని ఆయన సూచించారు. వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వామపక్ష సాహిత్యాన్ని విశాలాంధ్ర, ప్రజాశక్తి సంయుక్తంగా అందించేందుకు తొలి అడుగు వేయడం శుభపరిణామమన్నారు. ఇదేస్థాయిలో మరింత విస్తతంగా సమాజానికి అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2020లో వామపక్ష ప్రచురణకర్తలు ఏకమై రెడ్‌బుక్ ప్రచురణలు ప్రపంచానికి అందించారని తెలిపారు. మార్క్స్‌జం, లెనినిజానికి సంబంధించిన వేలాది బుక్‌లు అమ్మకాలు జరిగాయని తెలిపారు. భవిషŸ్యత్తులో దిమ్మతిరిగే సమాధానం ఇస్తామని తెలిపారు. అన్ని యూనివర్సిటీలలో సోషలిజంపై చర్చాగోష్టులు జరుగుతున్నాయన్నారు. సోషలిజం సజీవంగా నిలిచి ఉందని ప్రజలందరూ భావిస్తున్నారని చెప్పారు. ట్రంప్ విధానాలతో ఆర్థిక టెర్రరిజం ప్రపంచంలో పెరిగిపోతోందని, దీంతో దేశాలపై ఆర్థికప్రభావం తీవ్రంగా పడుతోందన్నారు. ట్రంప్‌కు లొంగుబాటులోనూ విధేయత చూపించడం ప్రధాని మోదీకే చెల్లిం<ని ఎద్దేవా చేశారు. దేశంలో అనేక వనరులు ఉన్నాయని, వాటిని వినియోగించుకో వడంలో పాలకులు పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. సీపీఐ ఎంఎల్ నాయకులు పి.ప్రసాద్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు బంగారురావు, సీపీఐ ఎంఎల్ నాయకులు జె.కిషోర్ బాబు, ఎంఎల్ ఎన్‌డీ నాయకులు ఎం.రామకష్ణ , ఎంసీపీఐయూ నాయకులు నాగభూషణ్, ఫార్వర్డు బ్లాక్ నాయకులు సుందరరామరాజు, ఆరఎ స్‌పీ నాయకులు జానకి రాములు, ఎన్‌యూసీసీ నేత అమర్నాథ్, ప్రజానాట్య మండలి నాయకులు పి.చంద్రనాయక్, ఆర్.పిచ్చియ్య, ఎస్.అనిల్‌కుమార్ తదితర కళాకారులతో పాటు సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


