Last Updated:
తణుకు భక్తులు రామచంద్రస్వామి – సావిత్రి దంపతులు వాడపల్లి వెంకటేశ్వర స్వామివారికి 60 లక్షల విలువైన 350 గ్రాముల బంగారు మకర తోరణాన్ని సమర్పించారు. భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
కలియుగంలో దైవ ఆరాధన, దైవ సేవల ద్వారానే మానవ జన్మ సార్థకం అవుతుందని పురాణాలు చెబుతుంటాయి. భగవంతుని సేవలో భాగంగా తమకు సాధ్యమైన మేరకు సమర్పణలు చేయడం కూడా పూర్వజన్మ సుకృతమేనని ఆధ్యాత్మికవేత్తలు చెప్పే మాట. అలాంటి భక్తి భావంతోనే కొందరు మహాభక్తులు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అమూల్యమైన కానుకను సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. లక్షలాది రూపాయల విలువ చేసే బంగారు మకర తోరణాన్ని సమర్పించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
తిరుమల తిరుపతి మహిమలా రోజురోజుకు ఖ్యాతి పెంచుకుంటున్న వాడపల్లి దివ్యక్షేత్రంలో ఏడువారాల వెంకటేశ్వర స్వామి భక్తులకు చందన రూపంలో దర్శనమిస్తుంటారు. కోరిన కోరిక నెరవేరుతుందనే విశ్వాసంతో వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఏడు వారాల పాటు స్వామివారిని దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉండటంతో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.
ఇలాంటి పవిత్రక్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక కానుకగా 350 గ్రాముల బరువున్న బంగారు మకర తోరణాన్ని సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లోని తణుకు ప్రాంతానికి చెందిన భక్తులు పుణ్యమూర్తులు రామచంద్రస్వామి – సావిత్రి దంపతులు సుమారు 60 లక్షల రూపాయల విలువైన ఈ బంగారు మకర తోరణాన్ని తయారు చేయించి ఆలయానికి తీసుకొచ్చారు. స్వామివారి మాడ వీధుల్లో భక్తుల మధ్య ఘనంగా తీసుకువచ్చిన ఈ తోరణాన్ని చూసి భక్తులు భక్తి పరవశంలో మునిగిపోయారు.
మకర తోరణాన్ని ఆలయానికి తీసుకువచ్చే సమయంలో అక్కడున్న భక్తులు కూడా ఆ దివ్య కానుకను కనులారా తిలకించారు. కొందరు భక్తులు ఆనందంతో ఆ తోరణంపై చేయి వేసి స్వామివారికి సమర్పించే ఆ పవిత్ర క్షణానికి సాక్షులయ్యారు. ఆ తర్వాత ఆలయ దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు ఈ బంగారు మకర తోరణాన్ని స్వీకరించారు.
ఇకపై వాడపల్లి వెంకటేశ్వర స్వామివారు ఈ బంగారు మకర తోరణంతో భక్తులకు మరింత వైభవంగా దర్శనమివ్వనున్నారు. స్వామివారికి ఈ సేవ చేయడం తమ పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నామని మకర తోరణాన్ని సమర్పించిన రామచంద్రస్వామి – సావిత్రి దంపతులు తెలిపారు. ఈ అపూర్వ సేవతో వాడపల్లి దివ్యక్షేత్రం మరింత వైభవంగా మారిందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh
Mar 06, 2026 10:24 PM IST


