తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన అనసూయ
హైదరాబాద్: ఇటీవల యాంకర్, నటి అనసూయ హోలీ సంబరాల్లో పాల్గొన్న విషయం తెలిసినదే. ఆ సంబరాల్లో ఆమె మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు ‘ఆంటీ’ అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా కొందరు ఆ వీడియోకు వచ్చిన కామెంట్స్ తో రీల్స్ చేయడం ప్రారంభించారు. ఆ రీల్స్ పై ఆమె పోస్ట్ పెట్టారు… ” ఇతరుల బాధలో కూడా వినోదం వెతికే వారిని, కనీస సానుభూతి, సామాజిక బాధ్యత లేని వారిని సమాజం నిలదీసే రోజు రావాలి. వయస్సును బట్టి హేళన చేయడం, మహిళలపై వివక్షచూపడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి వారిని చూసి సమాజం సిగ్గుపడాలి. అందరూ నాకెందుకులే అని వదిలేస్తూ వెళ్తే ఇలాంటివి సాధారణం అవుతాయి. క్రమంగా మానవత్వాన్ని కోల్పోతాం”. అని అనసూయ తన పోస్ట్ లో పేర్కొన్నారు. తప్పు చేసే వారిని వదిలేసి, దాన్ని ఎదురించే వారిని టార్గెట్ చేయడంపై తాజాగా ఆమె అసహనం వ్యక్తం చేశారు. తాను ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి మొహమాట పడనని, సాధించిన విజయాలు, తన ప్రయాణం తనకెంతో గర్వకారణం అన్నారు. ఎన్నో ఎదుర్కొని పైకి వచ్చే వారిని విమర్శించడానికి మీరెవరు అంటూ ట్రోలర్స్ ను ఉద్దేశించి ఆమె పోస్ట్ లో పేర్కొన్నారు.


