లూలుకు భూకేటాయింపుపైవెనక్కి తగ్గిన ప్రభుత్వం


విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: విజయవాడలో లూలు గ్రూపుకు భూముల కేటాయింపుపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలోని ఆర్‌టీసీ స్థలాన్ని లూలు మాల్‌కు కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో లూలు మాల్‌కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్‌పేట ఆర్‌టీసీ డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని చంద్ర బాబు నేతత్వంలోని కూటమి ప్రభుత్వం లూలు గ్రూపునకు కేటాయించింది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.600 కోట్లపైనే ఉండగా… జీ ప్లస్ 3 విధానంలో లూలు షాపింగ్ మాల్ ఏర్పాటు చేసుకునేందుకు 99 ఏళ్ల లీజుపై ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దీన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అత్యంత విలువైన ఈ భూములను లూలుకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐతో పాటు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేశాయి. వీరి పోరాటానికి ప్రభుత్వం వెనక్కుతగ్గింది.
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం: ఈశ్వరయ్య
విజయవాడ నడిబొడ్డున లూలుకు కేటాయించిన ఆర్టీసీ స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లూలుకు ఆర్టీసి స్థలం కేటాయించడాన్ని మొదటి నుండి సీపీఐ వ్యతిరేకించిందని తెలిపారు. ప్రజాసంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించినా ప్రభుత్వం విలువైన భూములు లూలుకు కట్టబెట్టిందన్నారు.
ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు పోరాట ఫలితంగానే ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గిందని, ఈ నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. మళ్లీ లూలుకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే పోరాటం చేస్తామని ఈశ్వరయ్య హెచ్చరించారు.

The post లూలుకు భూకేటాయింపుపైవెనక్కి తగ్గిన ప్రభుత్వం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *