Last Updated:
రాయలం జయశ్రీ, చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం జర్రావారిపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీరాముల రెడ్డి కుమార్తె, సివిల్స్ పరీక్షలో 360వ ర్యాంక్ సాధించి పలమనేరుకు గర్వకారణంగా నిలిచింది.
సాధారణ రైతు కుటుంబంలో పుట్టి దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ర్యాంక్ సాధించడం చిన్న విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను సాధించి పలమనేరుకు గర్వకారణంగా నిలిచింది రాయలం జయశ్రీ. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం, పలమనేరు రూరల్ మండలంలోని జర్రావారిపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీరాముల రెడ్డి కుమార్తె అయిన జయశ్రీ సివిల్స్ పరీక్షలో 360వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. మూడవ ప్రయత్నంలోనే ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంక్ సాధించి విజేతగా నిలిచింది.
జయశ్రీ తన ప్రాథమిక విద్యను స్వగ్రామ పరిసరాల్లోనే పూర్తి చేసింది. ఇంటర్ చదువును పలమనేరులో పూర్తిచేసి, తరువాత ఉన్నత చదువుల కోసం పులివెందులలోని జెఎన్‌టీయూలో చదివింది. చదువులో ఎప్పటికీ ముందుండే జయశ్రీ సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించాలనే సంకల్పంతో కష్టపడి చదివింది. తన లక్ష్యాన్ని సాధించేందుకు క్రమశిక్షణతో శ్రమించి చివరకు సివిల్స్ పరీక్షలో ర్యాంక్ సాధించి అందరి ప్రశంసలు అందుకుంది.
రైతు కుటుంబానికి చెందిన ఒక యువతి ఇంతటి విజయం సాధించడంతో పలమనేరులో ఆనందం వెల్లివిరిసింది. ఆమె విజయాన్ని అభినందించేందుకు పట్టణ ప్రముఖులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, గురువులు మరియు శ్రేయోభిలాషులు ఆమె ఇంటికి చేరుకుని ఘనంగా సన్మానించారు. పలమనేరుకు చెందిన సీఐ మోహన్ కుమార్ కూడా ఆమెను అభినందిస్తూ, జయశ్రీ విజయాన్ని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని సూచించారు.
సివిల్స్‌లో ర్యాంక్ సాధించిన జయశ్రీ విజయానికి ఆమె తల్లిదండ్రుల కష్టం ప్రధాన కారణమని ఆమె చెబుతోంది. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారని, వారి శ్రమను గుర్తుంచుకుని సివిల్స్‌కు సిద్ధమయ్యానని తెలిపింది. ఎంతో ఇష్టంతో కష్టపడి చదవడం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆమె పేర్కొంది.
ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ తన విజయానికి ప్రధాన కారణం తన తల్లిదండ్రుల ప్రోత్సాహమని తెలిపింది. వారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చానని చెప్పింది. సివిల్స్‌లో తనకు ఐఆర్‌ఎస్ లేదా ఐపీఎస్ వంటి సేవలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆడపిల్లలను తమ అభిరుచులకు అనుగుణంగా ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తే వారు ఎలాంటి విజయాన్నైనా సాధించగలరని ఆమె తెలిపింది.
తన ప్రాథమిక చదువులు గ్రామంలోనే పూర్తయినప్పటికీ అదే పునాది ఉన్నత చదువుల్లో ఎంతో సహాయపడిందని జయశ్రీ పేర్కొంది. ఏ గ్రూప్ చదివినా సరే కృషి, పట్టుదల ఉంటే ఉద్యోగం సాధించవచ్చని ఆమె అభిప్రాయపడింది. మనం ఏ విద్యను అభ్యసించినా శ్రద్ధతో, విలువలతో చదివితే విజయాన్ని అందుకోవడం సాధ్యమని తెలిపింది.
తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ముందుకు సాగే వారు జీవితంలో తప్పకుండా ఉన్నత స్థానానికి చేరుకుంటారని జయశ్రీ పేర్కొంది. తల్లిదండ్రుల శ్రమకు ప్రతిఫలంగా ఈ ఉద్యోగం రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈ యువతి సాధించిన విజయం పలమనేరుకు మాత్రమే కాకుండా గ్రామీణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Andhra Pradesh


