ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం -ఏఓ కృష్ణచైతన్య
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రైతులు ప్రకృతి వ్యవసాయం సాగుపై దృష్టి సారించాలని, రాబోయే ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి (ఏఓ) కృష్ణచైతన్య పేర్కొన్నారు. గొందిరెడ్డిపల్లి రైతుసేవ కేంద్రం పరిధిలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం
నిర్వహించారు. ఏఓ మాట్లాడుతూ, రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కోవడానికి రైతులు సిద్ధంగా ఉండాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటలను కాపాడుకునేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులైన పీఎండీఎస్, హాఫ్ మూన్ మోడల్, ఏటీఎం విధానాలను అనుసరించాలని రైతులకు వివరించారు. అనంతరం ప్రతి రైతు తప్పనిసరిగా ‘ఫార్మర్ యాప్’ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఈ యాప్ ద్వారా వాతావరణ సమాచారం, పంట సాగు పద్ధతులు, మార్కెటింగ్ ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, అలాగే రైతులందరూ ఏపీఎఫ్ఆర్ (రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య) ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన నిధుల విడుదలపై రైతులకున్న సందేహాలను ఆయన ఈ సందర్భంగా నివృత్తి చేశారు.
అదేవిధంగా రైతులకు భూసార పరీక్షా పత్రాలను అందజేస్తూ, పరీక్షా ఫలితాలకు అనుగుణంగానే ఎరువులను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రంజిత, సుజిత, రైతు సేవా కేంద్రం సిబ్బంది గంగరాజు, గ్రామ రైతులు పాల్గొన్నారు


