విశాలాంధ్ర బ్యూరో-నెల్లూరు : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కేంద్రవినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో కలిసి ఆయనను కలిసి ఆంధ్రప్రదేశ్ చౌక ధరల దుకాణ దారుల సంక్షేమ సమాఖ్య, ఆల్ ఇండియా ఫేర్ ప్రైజ్ షాప్ ఫెడరేషన్ తరఫున వినతిపత్రం అందజేశారు. ఇటీవల రేషన్ డీలర్లు వివిధ సమస్యలపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో కేంద్రమంత్రితో భేటీ అయి సమస్యలను విన్నవించారు. చౌక ధరల దుకాణాల డీలర్లకు ప్రస్తుతం సగటు కమీషన్ నెలకు రూ.6000 నుంచి రూ.8000/- మధ్య ఉంటోందని, ఇది జీవనోపాధికి సరిపోవడం లేదన్నారు. రేషన్ షాపు అద్దె, క్లర్క్ జీతం, విద్యుత్ బిల్లు, దివ్యాంగులకు మరియు వృద్ధులకు ఇంటింటికీ డెలివరీ చేయడం వంటి నిర్వహణ ఖర్చులు భారంగా మారాయన్నారు. చౌక ధరల దుకాణాల డీలర్లకు ప్రభుత్వం నెలకు రూ. 35,000/- ఆదాయాన్ని అందించాలని విన్నవించారు. అలాగే దుకాణాల డీలర్లకు కుటుంబ ఆరోగ్య కార్డులను అందించేలా చూడాలని కోరారు. డీలర్ మరణించిన పక్షంలో, వారి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు . 25 లక్షల ఎక్స్-గ్రేషియా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావలసిన అన్ని బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.. రేషన్ డీలర్ల సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చౌక ధరల దుకాణ దారుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు గిరిజారావు తదితరులు పాల్గొన్నారు.


