రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు – Visalaandhra


విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యామండలి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న పరీక్షల కోసం1,537 కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ భాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, క్రమశిక్షణతో కూడిన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,57,312 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నాట్టు చెప్పారు. మార్చి 24 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం, ఈ నెల 24 నుంచి మార్చి 23 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.
‘నిమిషం’ నిబంధన పక్కా
“పరీక్షల నిర్వహణలో విద్యామండలి సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఉదయం తొమ్మిది గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా నిబంధనల ప్రకారం అభ్యర్థులను పరీక్షా హాల్లోకి అనుమతించే ప్రసక్తే లేదు. విద్యార్థులు కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి” అని బోర్డు స్పష్టం చేసింది. పరీక్షల పారదర్శకత కోసం ప్రతి గదిలోనూ సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. కలెక్టర్ల నేతృత్వంలో పరీక్షా కమిటీలు, ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లు నిరంతరం తనిఖీలు చేపడతాయి. ప్రతి కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, వెలుతురు వంటి కనీస సౌకర్యాలపై ఇప్పటికే తనిఖీలు పూర్తయ్యాయి. అత్యవసర చికిత్స కోసం ప్రతి కేంద్రం వద్ద ఒక ఏఎనఎం, ఆశా వర్కర్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆరఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షా సమయాల్లో అదనపు ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపాలని అధికారులకు సూచించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, క్యాలిక్యులేటర్లు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. ఓఎంఆర్ షీట్ అందిన వెంటనే విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని బోర్డు సూచించింది. ఏదైనా అత్యవసర సమస్య తలెత్తితే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పని చేసే టోల్ ఫ్రీ నెంబర్: 1800 425 1531ను సంప్రదించవచ్చు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి తప్ప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఇంటర్ బోర్డు విజ్ఞప్తి చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *