Last Updated:
గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం తీవ్ర భయం రేపుతోంది. కాకినాడ, రంపచోడవరం ప్రాంతాల్లో పశువులపై దాడులతో ప్రజలు అటవీశాఖపై చర్యలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అడవిలోనే ఉండాల్సిన ఈ క్రూర మృగం తరచూ అడవిని వదిలి సమీప గ్రామాల మైదానాల్లోకి రావడం, ఆవులు, గేదెలపై దాడులు చేయడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గత నెల రోజులుగా కాకినాడ, రంపచోడవరం ప్రాంతాల్లో ఈ పెద్దపులి సంచరిస్తూ రెండు జిల్లాల్లో దాగుడుమూతలు ఆడుతున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా “పులి ఎందుకు అడవిని వదిలి బయటికి వస్తోంది.. అనే ప్రశ్నపై విస్తృత చర్చ జరుగుతోంది.
గోదావరి పరిసర ప్రాంతాల్లో దట్టమైన అటవీ విస్తీర్ణం ఉండి, అనేక వన్యప్రాణులు అక్కడే నివసిస్తున్నప్పటికీ, పులి బయటకు రావడం వెనుక కారణాలపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖ ప్రకారం ఈ అడవుల్లో సింహాలను మినహాయిస్తే దాదాపు అన్ని జంతువులు ఉన్నాయి. అయినప్పటికీ అడవి విస్తీర్ణం సుమారు 15 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉండటంతో, పులికి తగిన ఆహారం దొరకకపోవడం ఒక కారణంగా భావిస్తున్నారు. మరోవైపు అటవీ సమీప ప్రాంతాల్లో కొందరు నాటు తుపాకీలు, ఈటెలతో అడవి జంతువులను వేటాడడం వల్ల సహజ ఆహారం తగ్గిపోయిందనే ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది.
అడవిలో వేటాడటం అంత తేలిక కాదు. ఒక అడవి పంది, జింక లేదా ఇతర జంతువులను పట్టుకోవాలంటే పులి కిలోమీటర్ల దూరం వెంబడించాల్సి వస్తుంది. అంత కష్టపడి చేసిన వేటలో కూడా విజయవంతం అవుతుందనే హామీ ఉండదు. కానీ మైదాన ప్రాంతాల్లో తాడుతో కట్టిన ఆవులు, గేదెలు పులికి సులభమైన లక్ష్యాలుగా మారుతున్నాయి. ఈ కారణంగా “ఈజీ వేట”కు అలవాటు పడిన పెద్దపులి అడవిని వదిలి గ్రామాల వైపు మొగ్గు చూపుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశువులను చంపిన తర్వాత పీక భాగంలో నొక్కి రక్తం తాగి అక్కడి నుంచి వెళ్లిపోవడం కూడా గమనించబడుతోంది.
గత నెల రోజులుగా ఈ పెద్దపులి కనీసం రెండు రోజులకు ఒకసారి దాడులు చేస్తూ కాకినాడ, రంపచోడవరం ప్రాంతాల్లో సంచరిస్తోంది. ఒక రోజు అడవిలోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తే, మరుసటి రోజు మళ్లీ గ్రామాల్లో కనిపించడం సాధారణమైపోయింది. ఈ విధంగా అడవిలోకి వెళ్లి తిరిగి బయటకు రావడం వల్ల స్థానికులు ఎప్పుడెప్పుడు పులి ఎదురవుతుందోనన్న భయంతో జీవిస్తున్నారు. రైతులు తమ పశువులను బయటకు విడిచేందుకు కూడా భయపడుతున్నారు.
ప్రస్తుతం రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం మండలంలో ఈ పెద్దపులి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. తాజాగా ఒక ఆవును చంపి ఆహారంగా తీసుకున్న ఘటన మరింత కలకలం రేపింది. ఒకవైపు కాకినాడ జిల్లాలో కనిపిస్తే, మరోవైపు రంపచోడవరం ప్రాంతంలో కనిపించడం వల్ల ఇది రెండు జిల్లాల్లో దాగుడుమూతలు ఆడుతున్నట్లు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అటవీశాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అటవీ శాఖ అధికారులు పులి అడవిలోకి వెళ్లిపోతుందని భావిస్తూ కొంత అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ రోజురోజుకూ పరిస్థితి సీరియస్ అవుతుండటంతో వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల వద్ద భద్రతా చర్యలు పెంచడం, పులిని తిరిగి అడవిలోకి పంపించడం లేదా పట్టుకునే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మొత్తం మీద పెద్దపులి సంచారం ఇప్పుడు గోదావరి జిల్లాల్లో పెద్ద సమస్యగా మారగా, తదుపరి రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో అన్నది అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


