Last Updated:
కాకినాడ శంఖవరం మండపం బాలుడు రూ10 నాణెం మింగి పది రోజులు ఇరుక్కుపోయింది, తుని ప్రైవేట్ ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ సర్జరీతో సురక్షితంగా తొలగించారు
ఆడుకుంటూ చేసిన చిన్న తప్పు.. కుటుంబానికి పెద్ద టెన్షన్‌గా మారింది. పిల్లలు చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఎంత పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయో మరోసారి గుర్తు చేసిన ఘటన ఇది. రూ.10 కాయిన్ మింగిన ఓ బాలుడి కథ ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తూనే, చివరికి ఊపిరి పీల్చుకునేలా చేసింది.
కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు ఇంట్లో ఆడుకుంటూ ఉండగా అనుకోకుండా రూ. 10 నాణెం మింగేశాడు. మొదట్లో ఇది పెద్ద సమస్య కాదని, సహజంగానే విసర్జన ద్వారా బయటకు వచ్చేస్తుందని కుటుంబ సభ్యులు భావించారు. రోజులు గడిచాయి.. కానీ కాయిన్ మాత్రం బయటకు రాలేదు. పది రోజులు గడిచినా పరిస్థితి మారకపోవడంతో కుటుంబంలో ఆందోళన పెరిగింది. బాలుడిని పలుమార్లు అడిగితే కాయిన్ కడుపులోనే ఉంది అని చెప్పడంతో భయం మరింత పెరిగింది. చివరకు సమీప పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు బాలుడిని పరీక్షించి స్కానింగ్ చేయగా షాకింగ్ విషయం బయటపడింది. రూ.10 నాణెం పేగులు వంగే కీలక ప్రాంతంలో ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశముండటంతో వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. డాక్టర్ ఏవీ రమణ, డాక్టర్ జానకిదేవి నేతృత్వంలోని వైద్య బృందం అధునాతన లాప్రోస్కోపిక్ విధానాన్ని ఉపయోగించి శస్త్రచికిత్స చేశారు. సాధారణంగా పెద్ద నగరాల్లోనే జరిగే ఈ తరహా ఆపరేషన్‌ను తుని ప్రాంతంలో విజయవంతంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. సర్జరీ సక్సెస్ కావడంతో బాలుడి కడుపులో ఉన్న కాయిన్‌ను సురక్షితంగా బయటకు తీశారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం స్థిరంగా ఉండడంతో డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. వైద్యుల చాకచక్యానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. చిన్న వస్తువులు పిల్లల చేతికి అందకుండా చూసుకోవడం, ఏదైనా అనుమానం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతో ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్క కాయిన్ కానీ పదిరోజుల టెన్షన్.. చివరకు డాక్టర్ల సమయోచిత చర్యతో ముగిసిన ఈ ఘటన ఇప్పుడు అందరికీ హెచ్చరికగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh



