రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి గత ప్రభుత్వమే కారణం: షర్మిల


వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె వైసీపీ ఐదేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని ఆమె ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని, కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు. రాజకీయ అంశాలపైనా స్పందిస్తూ… ప్రత్యేక హోదా కోసం మోదీ కాలర్ పట్టుకుంటానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లతో అండగా ఉంటుందని, కానీ బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సభలో పాల్గొన్న పార్టీ మహిళా అధ్యక్షురాలు అమర్ జహాబేగ్ మాట్లాడుతూ, సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఎలా మేలు చేస్తారని వ్యాఖ్యానించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *