రంగోలి ద్వారా మహిళా శక్తికి గౌరవం.. విశాఖలో విద్యార్థినుల సృజనాత్మక ప్రదర్శన..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

ఆంధ్ర యూనివర్సిటీలో మహిళా దినోత్సవం సందర్భంగా రంగోలి పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు సృజనాత్మక ముగ్గులతో మహిళా శక్తి, సమానత్వం, సామర్థ్యాన్ని ప్రతిబింబించారు.

+

ఆంధ్ర

ఆంధ్ర యూనివర్సిటీలో ఘనంగా ముగ్గులు పోటీలు

ఒక శిశువుకు జన్మనిచ్చే అమ్మగా, తోడుండే చెల్లిగా, జీవిత ప్రయాణంలో తోడుగా నిలిచే భార్యగా ప్రతి రూపంలోనూ మహిళ ఈ సృష్టికి ప్రాణాధారం. మహిళ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక మహాశక్తి. నేటి సమాజంలో మహిళలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం నుంచి అంతరిక్షం వరకు తమ ప్రతిభను చాటుతున్నారు. కుటుంబాన్ని సమర్థంగా నడిపిస్తూ దేశ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓర్పులో భూదేవిలా, ధైర్యంలో దుర్గాదేవిలా నిలిచే మహిళల గొప్పతనాన్ని గుర్తుచేసేలా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందస్తుగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో మహిళా విద్యార్థుల కోసం రంగోలి (ముగ్గులు) పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఆంధ్ర యూనివర్సిటీ మహిళా విద్యార్థులతో పాటు అనుబంధ కళాశాలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. ఒక్కో విద్యార్థిని తన సృజనాత్మకతను రంగుల్లో మలిచుతూ అద్భుతమైన ముగ్గులను వేసింది. మహిళ కేవలం వంటింటికే పరిమితం కాదని, కుటుంబం నుంచి సమాజం వరకు ప్రతి రంగంలోనూ తనకు ప్రత్యేకమైన స్థానం ఉందని ముగ్గుల రూపంలో సందేశాలు ఇచ్చారు.

ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్‌లో రంగురంగుల ముగ్గులతో కళాత్మక వాతావరణం నెలకొంది. పల్లెటూరు వాతావరణాన్ని గుర్తుచేసేలా, మన సంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థినులు వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ రంగులతో కళాత్మకంగా తీర్చిదిద్దిన ముగ్గులు అక్కడికి వచ్చిన వారిని అబ్బురపరిచాయి. ఒక్కో ముగ్గు వెనుక ఒక సందేశం దాగి ఉండగా, మహిళా శక్తి, సమానత్వం, మహిళల సామర్థ్యం వంటి అంశాలు ప్రధానంగా కనిపించాయి.

ఇలాంటి పోటీలను నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని పాల్గొన్న విద్యార్థినులు తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ ప్రతిభను చూపించుకునే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. సంస్కృతి, సంప్రదాయం, సృజనాత్మకత కలగలిపిన ఈ పోటీలు తమకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చాయని వారు పేర్కొన్నారు.

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. యూనివర్సిటీలో చదువుతున్న మహిళా విద్యార్థులతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థినులను కూడా పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చామని చెప్పారు. పెద్ద ఎత్తున విద్యార్థినులు పాల్గొని వివిధ సామాజిక సందేశాలతో ముగ్గులు వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. మహిళా శక్తికి గౌరవం తెలుపుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *