వారి లక్ష్యంగానే మ్యానిఫెస్టో రూపకల్పన
చెన్నై: తమిళనాడులో ఎన్నికల వాతావరణం రసవత్తరంగా ఉంది. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే కూటములతో విజయ్ పార్టీ టీవీకే ఉత్సాహంగా ప్రచారం సాగిస్తోంది. ఆ రెండు కూటములకు ప్రత్యామ్నాయంగా వచ్చిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) యువ ఓటర్లే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. వారిని లక్ష్యంగా చేసుకునే టీవీకే అధినేత విజయ్ మ్యానిఫెస్టోను రూపొందించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ, గ్రామీణ యువతను ఆకర్షించేలా విద్య, ఉద్యోగాలు, అందుకోసం ఆర్థిక సహకారం వంటి హామీల్ని టీవీకే తెచ్చింది. ఇది యువతలో కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. ఈ హామీల్ని యువతకు వేగంగా చేరవేసేందుకు, వారిలో చైతన్యం నింపేందుకు టీవీకే ఐటీ విభాగం శ్రమిస్తోంది. ఆ దిశగా ప్రచారం ముమ్మరం చేసింది.
ఉన్నచోటే ఉద్యోగం…
ఉన్నచోటే ఉద్యోగం పేరుతో యువతను ఆకట్టుకునే హామీలిచ్చారు విజయ్. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో స్థానిక యువతకే ఉద్యోగాలు వచ్చేలా ‘ముఖ్యమంత్రి ప్రజా సేవామిత్ర’ పథకాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని కంపెనీలకూ ఓ నిబంధన పెడతామని చెప్పారు. 75శాతం ఉద్యోగాలు తమిళులకే ఇచ్చేలా చేస్తామని తెలిపారు. ఇలా చేసిన వారికి రాష్ట్ర జీఎస్టీలో 2.5శాతం రాయితీ, విద్యుత్తు టారిఫ్‌లో రాయితీ ఉంటుందని వివరించారు. ప్రభుత్వపరంగా సేకరించే ఉత్పత్తుల్లో ఆయా సంస్థలకు ప్రాధాన్యమిస్తామనడం ఆకట్టుకుంటోంది. నిరుద్యోగ యువతకూ ఊరటనిచ్చేలా ఇంకో హామీ ఇచ్చారు. 29 ఏళ్లు పైబడినా నిరుద్యోగులుగా మిగిలిన వారికి నెలవారీ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్స్‌కు రూ.4వేలు, డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ.2వేలు ప్రకటించారు. నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రత్యేక యువ సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇంకోవైపు ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో ఏటా 5 లక్షల మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించడంతోపాటు వారికి నెలవారీ స్టైపెండ్ ఇచ్చేలా వరాలు గుప్పించారు.
ఆకర్షణీయమైన హామీలు…
తమిళనాడులో మత్తు పదార్థాలు విచ్చలవిడిగా ఉన్నాయని, ‘మత్తు రహిత తమిళనాడు’ను చేసేందుకు యువతను భాగస్వాములను చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘తమిళనాడు యువ సలహా మండలి’ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 8వ తరగతి నుంచి పీహెచ్డీ దాకా చదువుపై బెంగ లేకుండా బ్యాంకుల్లో హామీ పత్రాలు సమర్పించకుండా రూ.20 లక్షల దాకా వడ్డీలేని రుణాలు ఇప్పించే పథకాన్ని తెస్తామన్నారు. చదువులు పూర్తయ్యాక వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు సాయాన్ని ప్రకటించారు. నిజాయతీగా ఉన్న యువతకు రూ.25 లక్షల వరకు వడ్డీలేని, గ్యారంటీ అక్కర్లేని రుణాలిప్పిస్తామని హామీ ఇచ్చారు. 234 మందిని గెలిపించడానికి విజయ్ బాగా శ్రమించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మ్యానిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, విజిల్ గుర్తును, తన కరిష్మాను వ్యూహాత్మకంగా ఉపయోగించడంపైనే విజయ్ పనితనం ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు.


