హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యుఫోరియా’ సినిమా ఇటీవల విడుదలైంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన మహేశ్ బాబు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘గుణశేఖర్ తన కథలను తెరకెక్కించే విధానం ఎప్పుడూ ఓ ప్రత్యేక శైలిలో ఉంటుంది. ఈ సినిమా నేను ఎంతో ఎంజాయ్ చేశా… ముఖ్యంగా క్లైమాక్స్‌ను మలిచిన తీరు బాగుంది. ఈ సినిమాను అందరూ తప్పక చూడండి. గుణశేఖర్, భూమికతో పాటు చిత్రబృందం మొత్తానికి అభినందనలు. గుణశేఖర్ మేకింగ్, ఆయన టెక్నికల్ టీమ్ మ్యాజిక్ చేసింది’ అని మహేశ్ తెలిపారు. గుణశేఖర్ దర్శకత్వంలో మహేశ్ బాబు ‘ఒక్కడు, అర్జున్, సైనికుడు’ చిత్రాలలో నటించారు. ఇందులో ‘ఒక్కడు’ సినిమాలో మహేశ్ సరసన భూమిక హీరోయిన్గా నటించారు. దాదాపు 23ఏళ్ల తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో ‘యుఫోరియా’లో భూమిక కీలకపాత్ర పోషించడం విశేషం. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం ‘యుఫోరియా’ చిత్రాన్ని చూసి… గుణశేఖర్ చిత్రీకరణను మెచ్చుకోవడంతో పాటు ప్రజలందరూ ఈ సినిమా తప్పక చూడాలని ఆయన అన్నారు. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి తదితరులు నటించారు.
The post ‘యుఫోరియా’ప్రతి ఒక్కరూ చూడాలి: మహేశ్ appeared first on Visalaandhra.


