సర్వేలో అమెరికన్ల నిరసన
వాషింగ్టన్: ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అమెరికన్లు భావిస్తున్నారు. గ్యాస్ ధరలు మరింత పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధం వల్ల స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా తమకు నష్టాలే జరుగుతాయనే అభిప్రాయంతో వారు ఉన్నారు. ఓ అమెరికన్ మీడియా సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో ఈవిషయం వెల్లడైంది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో ఇంధన ధరలు పెరగడం ఇప్పటికే ప్రారంభమైందని సర్వేలో పాల్గొన్న అనేమంది అమెరికన్లు చెప్పారు. యుద్ధం ఆగకుంటే ఇంధన ధరల పెరుగుదల ఇంకా కొనసాగుతుందని వారు అంచనా వేశారు. మళ్లీ అమెరికాను ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందేమోననే భయాన్ని పెద్దసంఖ్యలో అమెరికన్లు వెలిబుచ్చారు. అన్ని నిత్యావసరాల ధరలు వేగంగా పెరుగుతుండటం తమను కలవరంలోకి నెడుతోందని వారు తెలిపారు. యుద్ధం ఫలితంగా పెరిగిన గ్యాస్ ధరలను తాము ఎందుకు భరించాలని చాలా మంది అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు. యుద్ధానికి బడ్జెట్ కేటాయింపులను పెంచి, తమ జీవితాలను భారంగా మార్చడం సరికాదని వారు వాదిస్తున్నారు. అసలు అమెరికా ఈ యుద్ధం ఎందుకు చేస్తోంది? ఎప్పటివరకు చేస్తుంది ? అనే దానిపై ట్రంప్ ప్రభుత్వం తమకు స్పష్టత ఇవ్వడం లేదని సర్వేలో పాల్గొన్న కొందరు అమెరికన్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ యుద్ధాన్ని ముగించాలని వారు సూచించారు. కానీ ఈ సర్వేలో పాల్గొన్న మెజారిటీ అమెరికన్లు, ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చకుండా యుద్ధాన్ని ఆపడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఇరాన్‌పై అమెరికా భూతల దాడులు చేయాలా ? వద్దా ? అనే విషయంలో అమెరికన్లు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్న మాగా రిపబ్లికన్లు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలకు గట్టిగా మద్దతు పలుకుతున్నారు. ఈ వర్గాన్ని మినహాయిస్తే, అమెరికా చేస్తున్న యుద్ధానికి చాలా తక్కువ మంది అమెరికన్లే మద్దతు పలుకుతున్నారు. ఇక అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న అప్రూవల్ రేటింగ్ 40 శాతం రేంజ్లో స్థిరంగా ఉందని సర్వేలో గుర్తించారు. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో ట్రంప్‌కు ఉన్న రేటింగ్ కాస్త బలహీనంగానే ఉంది.


