ప్రపంచ దేశాలకు తిరుపతి నుంచి బలమైన శాంతి సందేశం
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, “యుద్ధం వద్దు – శాంతి ముద్దు”, “యుద్ధం కాదు – శాంతి కావాలి” అనే నినాదాలతో ఈరోజు తిరుపతి నగరంలో విశాలమైన శాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.మరణిస్తున్న పసి కందులు, అమాయక ప్రజలు మరియు యుద్ధ వాతావరణం పట్ల మనస్సు కలత చెందిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల, వేమన విజ్ఞాన కేంద్రం ప్రధానకార్యదర్శి మల్లారపు నాగార్జున గారి సంయుక్త పిలుపుతో తిరుపతిలోని దాదాపు 35 సేవా సంస్థలు, ప్రజా సంఘాలు, సాహితీ సంస్థలు, వైద్య రంగ సంస్థలు అన్నీ సంఘటితమై,ఏకతాటిపై నిలిచి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయ వంతంగా నిర్వహించాయి.ఈ శాంతి ర్యాలీ ఉదయం 8:00 గంటలకు మహతి ఆడిటోరియం వద్ద ఘనంగా ప్రారంభమై, ఎన్టీఆర్ సర్కిల్, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్డు, శ్రీదేవి కాంప్లెక్స్ ల మీదుగా సాగి పాత మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీ సాగిన ప్రతి ప్రాంతంలో ప్రజలు ఆసక్తిగా వీక్షిస్తూ, పాల్గొన్న వారిని అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సుమారు 350 మంది శాంతికాముకులు, సామాజిక కార్యకర్తలు, మహిళలు, గాయకులు, సేవా సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని శాంతి పట్ల తమ నిబద్ధతను చాటిచెప్పారు. చేతుల్లో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని “యుద్ధం వద్దు – శాంతి ముద్దు”, “ప్రకృతి రక్షణే మానవ రక్షణ”, “మానవతా విలువలే మన బలం” వంటి నినాదాలతో నగర ప్రజల్లో చైతన్యం కల్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల, మల్లారపు నాగార్జున, రెడ్ క్రాస్ డాక్టర్ శ్రీహరి, IMA డాక్టర్ A.R రెడ్డి, రోటరీ క్లబ్ రాజేంద్ర, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మోహనకుమార్ రాజు, లయన్స్ క్లబ్ మధుసూదన్ రెడ్డి, రాజచంద్ర దుర్గా ప్రసాద్,పౌర చైతన్య వేదిక వాకా ప్రసాద్,సాకం నాగరాజ,రాఘవ, జన విజ్ఞాన వేదిక రెడ్డెప్ప,నడ్డి నారాయణ, రీచ్ ప్రతినిధి దేవ రాజులు,వే ఫౌండేషన్ అంకయ్య, శ్రీరాములు, గాయకులు కడివేటి, నాగ రాజు తదితర అన్ని సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు మానవాళికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, అమాయక ప్రజలు, చిన్నారులు తీవ్రమైన బాధలను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి, సహనం, పరస్పర గౌరవం, మానవతా విలువలు నేటి సమాజానికి అత్యవసరమని పేర్కొన్నారు. తిరుపతి వంటి ఆధ్యాత్మిక క్షేత్రం నుంచి ప్రపంచ దేశాలకు శాంతి పిలుపునివ్వడం ద్వారా సానుకూల మార్పు సాధ్యమవుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.


