విశాలాంధ్ర, డీ.హి.రేహాల్.. మండలం లోని కల్యాం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్ రీఛార్జ్ కోసం డబ్బులు ఇవ్వలేదనే మనస్తాపంతో 17ఏళ్ల బాలుడు పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు.గ్రామానికి చెందిన రైతు రామకృష్ణ, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు నవీన్ (17) ఉన్నారు. కుటుంబం వ్యవసాయ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. నవీన్ కూడా తల్లిదండ్రులతో కలిసి పొలం పనుల్లో చేస్తూ జీవనం కొనసాగించేవాడు.ఇటీవల తన మొబైల్ రీఛార్జ్ చేయించుకోవడానికి డబ్బులు కావాలని నవీన్ తన తండ్రిని కోరినట్లు సమాచారం. అయితే సంఘానికి చెల్లించాల్సిన డబ్బులు ఉన్నందున ప్రస్తుతం డబ్బులు లేవని తండ్రి చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే డబ్బులు ఇవ్వలేదనే ఆవేదనతో నవీన్ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.కుటుంబ సభ్యులు గమనించి వెంటనే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బళ్లారి ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు.ఈ ఘటనపై నవీన్ తండ్రి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి తెలిపారు.ఈ సంఘటన వలన గ్రామంలో విషాద ఛాయలు కమ్మేసింది.


