మొదటి సారి ఎమ్మెల్యేలు.. కానీ సభలో సీనియర్లకే సవాల్.. సమస్యలపై గళమెత్తిన ముగ్గురు మహిళా నేతలు..! Three Women MLAs Deliver Courageous Speeches in AP Assembly. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

ఏపీ అసెంబ్లీలో మిరియాల శిరీష దేవి, వరుపుల సత్యప్రభ, యనమల దివ్య ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించారు. గిరిజనుల, రహదారుల, మౌలిక వసతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

+

పొగడ్తలు

పొగడ్తలు కాదు పనిచేయాలి అసెంబ్లీలో దుమ్ములేపిన ముగ్గురు మహిళలు

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి ముగ్గురు మహిళ ఎమ్మెల్యేల ప్రసంగాలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ, సభలో వారు మాట్లాడిన తీరు సీనియర్ నేతలను తలపించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తమ నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వరుసగా మూడు రోజుల పాటు అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం గమనార్హంగా మారింది. అభివృద్ధి గురించి పొగడ్తలు చెప్పడం కాకుండా ప్రజల సమస్యలను స్పష్టంగా వివరించడం పట్ల ప్రజలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

గోదావరి ప్రాంతంలోని రంపచోడవరం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మిరియాల శిరీష దేవి గిరిజనుల సమస్యలను సభలో బలంగా ప్రస్తావించారు. గిరిపుత్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తూ, వారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు.

అదే సమయంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కూడా ప్రజల సమస్యలను సభలో వినిపించారు. ముఖ్యంగా ఏలేశ్వరం సమీప ప్రాంతాల్లో రహదారుల సమస్య తీవ్రంగా ఉందని పేర్కొంటూ, రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

తుని నియోజకవర్గం ఎమ్మెల్యే యనమల దివ్య కూడా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరతపై సభలో ధ్వజమెత్తారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామాల పేర్లు పేర్కొంటూ వివరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

ఇక కాకినాడ జిల్లాలో ఎస్‌సీజెడ్ పేరుతో రైతుల భూములు స్వాధీనం చేసుకున్న అంశాన్ని కూడా యనమల దివ్య సభలో ప్రస్తావించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కేవలం మూడు లక్షల రూపాయలు ఇచ్చి భూములు తీసుకుందని పేర్కొన్నారు. అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం అదనంగా మరో రెండు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించినప్పటికీ అవి పూర్తిగా అందలేదని తెలిపారు. మిగిలిన రైతులకు కూడా నష్టపరిహారం అందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

మొత్తానికి ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ముగ్గురు మహిళ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను ధైర్యంగా ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. టీవీల్లో ఈ ప్రసంగాలను చూసిన ప్రజలు కూడా వారి ధైర్యాన్ని అభినందిస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ ప్రజల సమస్యలను సభలో బలంగా వినిపించడంలో వారు చూపిన ధైర్యం రాజకీయ వర్గాల్లో కూడా ప్రశంసలు అందుకుంటోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *