‘మైనింగ్’ మాఫియా – Visalaandhra



*అడ్డుగోలుగా లీజు అగ్రిమెంట్లు
*ప్రభుత్వానికి పన్ను ఎగవేత
*రూ.కోట్లలోఆదాయానికి గండి
*మొద్దు నిద్రలో అధికారులు

విశాలాంధ్ర-చిత్తూరు : చట్టం వారికి చుట్టం. వారు చెప్పిందే శాసనం. అధికారం వారికి అండగా ఉంది. అందుకే వారిని అడిగే వారే లేరు. నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. అడ్డుగోలుగా లీజు అగ్రిమెంట్లు రాసిస్తున్నారు. కంకర, దుమ్ము అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నారు. పన్ను ఎగవేస్తూ రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రశ్నించే అధికారుల నోళ్లకు తాళం వేస్తున్నారు. ఒత్తిళ్లు తట్టుకోలేక కొంతమంది అధికారులు రాజీ పడిపోతున్నారు. మైనింగ్ మారాజులు అక్రమ మార్గంలో సంపాందించిన సొమ్ముతో రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. అయినా మైనింగ్ అధికారులు మొద్దు నిద్ర నటిస్తున్నారు.
చిత్తూరు జిల్లా పరిధిలో శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, గంగాధరనెల్లూరు, కార్వేటినగరం, పాలసముద్రం, యాదమరి, నగరి, పుత్తూరు మండలాల్లో వందకు పైగా క్వారీలు ఉన్నాయి. క్వారీల నిర్వహణకు మైనింగ్ శాఖ నుంచి అనుమతులు పొందాలి. అధికారులు అనుమతించిన ప్రాంతంలో మాత్రమే క్వారీలు నిర్వహించాలి. ఆ పరిధి కూడా దాటరాదు. కొంతమంది తమ సొంత అవసరాల కోసం క్వారీలు నిర్వహించేందుకు అనుమతులు పొందుతున్నారు. మరికొంతమంది వ్యాపారం కోసం అనుమతులు తీసుకుంటున్నారు. అనుమతులు పొందిన క్వారీ యజమానులు నిబంధనలకు నీళ్లు చల్లుతున్నారు. నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా… క్వారీలు మరింత విస్తరించి తవ్వకాలు చేస్తున్నారు. ఇక లోతు విషయంలో కూడా నిబంధన పాటించడం లేదు. పరిమితికి మించి లోతు తవ్వుతున్ననారు. ఇలా చేయడం వలన పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోంది. ఆ ప్రాంతాల ప్రజలు రోగాల బారిన పడుతూ అర్ధంతరంగా తనువులు చాలిస్తున్నారు.
జోరుగా అక్రమ వ్యాపారం
క్వారీల నిర్వాహకులు అక్రమ వ్యాపారం జోరుగా చేస్తున్నారు. కొంతమంది తమ సొంత అవసరాల కోసం కంకర తయారు చేసుకోవడానికి అనుమతులు పొందారు. అయితే వీరు ఈ నియమం పాటించడం లేదు. కంకర, దుమ్ము బయట వ్యక్తులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. క్వారీల్లో 40మి.మీ., 20మి.మీ., 12మి.మీ., 6మి.మీ. లతో కంకర తయారు చేస్తున్నారు. 40 మి.మీ., 20మి.మీ., కంకరను మన జిల్లాలోనే విక్రయిస్తున్నారు. అయితే 12మి.మీ., 6మి.మీ., కంకరను అందులో వచ్చే దుమ్మును తమిళనాడుకు తరలిస్తున్నారు. ఈ కంకర తమిళనాడుకు తరలించడానికి వీరికి ఎలాంటి అనుమతులు లేవు. తమిళనాడులో ఇసుక తవ్వకంపై నిషేధం ఉంది. ఈ స్థానంలో కంకర దుమ్ముతో రోబో ఇసుకను తయారు చేస్తున్నారు. దీంతో కంకర దుమ్ముకు తమిళనాడులో బాగా గిరాకీ ఉంది. తూర్పు మండలాల నుంచి తమళనాడుకు రోజుకు సగటున వంద లారీల వరకు కంకర, దుమ్ము తరలిస్తున్నారు. కంకర దుమ్ము 6మి.మీ., 12మి.మీ., కంకరను తరలించడానికి క్వారీల నిర్వాహకులు ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించడం లేదు. ఇలా చేయడం వలన ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. కంకర, దుమ్ము పెద్ద ఎత్తున తమిళనాడుకు తరలి పోతున్నా… అధికార యంత్రాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
ప్రభుత్వానికి పన్ను ఎగవేత
క్వారీల నిర్వాహకులు చాలా మంది ప్రభుత్వానికి పన్ను చెల్లించడం లేదు. నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటరుకు సుమారు రూ.100 వరకు పన్ను చెల్లించాల్సి ఉంది. ఇందుకు బదులుగా మైనింగ్ శాఖ వారు బిల్లులు ఇవ్వాలి. కంకర బయట ప్రాంతాలకు తరలించే సమయంలో ఈ బిల్లులను సంబంధిత లారీల డ్రైవర్లకు అందజేస్తారు. ఎవరైనా లారీని పట్టుకుంటే ఈ బిల్లులు చూపాల్సి ఉంటుంది. అయితే క్వారీల నిర్వాహకులు ఎలాంటి బిల్లులు లేకుండానే అక్రమంగా కంకర, దుమ్ము బయట ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా చేయడం వలన ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడుతోంది.
అనుమతులు లేక పోయినా…
మైనింగ్ శాఖ వారు చాలా కాలంగా పాత క్వారీల నిర్వహణకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. ఈ అనుమతులు ఉంటేనే క్వారీలు నిర్వహిచాలి. అయితే అనుమతులు లేక పోయినా క్వారీలు ఇష్టా రాజ్యంగా నిర్వహిస్తున్నారు. కొంతమంది కొత్త క్వారీల నిర్వహణకు అనుమతులు పొందారు. వాటిని పక్కన పెట్టి… పాత వాటినే నిర్వహిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ఇందుకు కారణం వారికి మామూళ్లు ముట్టడమేనని ఆరోపణ ఉంది.
బ్లాస్టింగ్ లో నిబంధనలకు నీళ్లు
క్వారీల బ్లాస్టింగ్ చేయడానికి తప్పకుండా అనుమతులు ఉండాలి. లైసెన్సు ఉన్న వారు మాత్రమే క్వారీల్లో బ్లాస్టింగ్ చేయాలి. అయితే చాలా క్వారీల్లో ఈ నిబంధన పాటించడం లేదు. లైసెన్సు లేక పోయినా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఏదైనా సమస్య ఉత్పన్నమైనపుడు లైసెన్సు ఉన్న వారిని ముందుకు తీసుకు వస్తున్నారు. చాలా కాలంగా ఈ తతంగం జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక పరిమిత లోతులోనే బ్లాస్టింగ్ చేయాలి. అయితే పరిమితికి మించి బ్లాస్టింగ్ చేయడం వలన భూకంపం వచ్చినట్లుగా భూమి దద్దరల్లి పోతోంది. ఈ కారణంగా క్వారీలకు సమీపంలో ఉన్న పల్లెల్లోని ఇళ్లు కూడా దెబ్బ తింటున్నాయి. గోడలు బీటలు వారి పోతున్నాయి. అంతేగాకుండా పల్లెల్లో ఇళ్ల మీద. బడులు మీద రాళ్లు పడుతున్నాయి.
అనుమతులు ఒక చోట… తవ్వేది మరోచోట
కొంతమంది క్వారీల నిర్వాహకులు అనుమతులు ఒకచోట పొంది… మరోచోట క్వారీలు తవ్వుతున్నారు. రికార్డుల్లో మాత్రం అనుమతులు పొందిన చోటే తవ్వుతున్నట్లు చూపుతున్నారు. ఇక పరిధి కూడా దాటి పోతున్నారు. తమకు కేటాయించిన స్థలం కంటే ఎక్కువ ఎక్కువ తవ్వేస్తున్నారు. మరికొంతమంది కొత్త క్వారీలు అనుమతి పొంది… పాత క్వారీల్లో తవ్వకాలు చేస్తున్నారు. చాలా క్వారీల్లో పరిమితికి మించి లోతు తవ్వేశారు. ఈ విషయం మైనింగ్ అధికారులకు కూడా తెలుసు. అయినా వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
మైనింగ్ అధికారుల లాలూచీ
క్వారీల నిర్వాహకులతో మైనింగ్ అధికారులు కొంతమంది లాలూచీ పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమ మైనింగ్ ఆపేందుకు అధికారులు దాడులు నిర్వహించాల్సి ఉంటుంది. అక్రమంగా కంకర, దుమ్ము, గ్రానైట్ తరలించే లారీలను సీజ్ చేయాల్సి ఉంది. అయితే దాడులు చేసే సమయంలోనే కొంతమంది క్వారీల నిర్వాహకులకు అధికారుల నుంచి ముందుగానే సమాచారం వస్తోంది. తాము దాడులకు వస్తున్నామని… జాగ్రత్తలు తీసుకోవాలని సమాచారం ఇచ్చేస్తున్నారు. దీంతో క్వారీల నిర్వాహకులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కొంతమంది నిర్వాహకులు మైనింగ్ శాఖ అధికారులకు నెలసరి మామూళ్లు ముట్ట చెబుతున్నారనే బలమైన ఆరోపణ ఉంది. ఇలా నెలసరి మామూళ్లు చెల్లించే క్వారీలకు చెందిన వాహనాలను మైనింగ్ శాఖ వారు పట్టించుకోవడం లేదు. నెలసరి మామూళ్లు చెల్లించని క్వారీలకు చెందిన వాహనాలను మాత్రమే సీజ్ చేస్తున్నారనే ఆరోపణ ఉంది. ఉన్నతాధికారులైనా స్పందించి మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *