మెడికల్, ఫార్మా మాఫియాపై 14న సీపీఐ ఆందోళనలు


. ఫార్మా నిరుద్యోగుల ఉపాధికి గండి
. డ్రగ్స్ కంట్రోల్ విభాగంలో భారీ అవినీతి
. నేటి సార్వత్రిక సమ్మెకు మద్దతు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్, ఫార్మా రంగాల్లో నెలకొన్న మాఫియా ధోరణులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 న సీపీఐ అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రజలు, మెడికల్ రంగంలోని నిరుద్యోగ యువత, ప్రజా సంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ రంగం ఒక పెద్ద మాఫియాగా రూపాంతరం చెందిందని, నకిలీ మందుల వినియోగం ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 14 న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఆందోళనలకు సంబంధించిన పోస్టర్‌ను విజయవాడ దాసరి భవన్‌లో పార్టీ నాయకులతో కలిసి బుధవారం ఈశ్వరయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మెడికల్, ఫార్మా మాఫియాను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ మందుల విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో దశాబ్దం క్రితమే నిషేధించిన ఔషధాలను కొనుగోలు చేసి వాటిని తెలుగు రాష్ట్రాలకు తీసుకువచ్చి, నిల్వల పేరుతో డ్రగ్స్ కంట్రోల్ విభాగం నుంచి అనుమతులు పొంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని ధ్వజమెత్తారు. చిన్న పిల్లలకు సంబంధించిన ఒక నిషేధిత టానిక్ మార్కెట్‌లో విస్తృతంగా విక్రయమవుతున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్, డ్రగ్స్ యంత్రాంగం సంవత్సరానికి సుమారు రూ.1,000 కోట్ల వరకు లంచాల రూపంలో ఈ బోగస్ మాఫియా, తయారీదారులు, పంపిణీదారుల నుంచి స్వీకరిస్తున్నట్లు ప్రాథమిక అంచనాలు ఉన్నాయన్నారు. ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేక మార్లు తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఆందోళనలకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 60 వేల మందుల దుకాణాలు కొనసాగుతున్నాయని, అందులో బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ వంటి అర్హతలు కలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో స్పష్టత లేదని అన్నారు. ఒకవైపు 30 వేల మంది అర్హత కలిగినవారు లేరని, మరోవైపు 30 వేల మంది బోగస్ సర్టిఫికెట్లతో అనర్హులు మందుల విక్రయాలు నిర్వహిస్తున్నారన్నారు. ఫార్మసీ చదివిన యువత భవిష్యత్ ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకు సుమారు 4 వేల బోగస్ సర్టిఫికెట్లను రద్దు చేసిన సందర్భాలున్నాయని తెలిపారు. మందుల విక్రయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, అవగాహన లేని వ్యక్తులతో విక్రయాలు నిర్వహించడం ప్రజారోగ్యానికి తీవ్ర ముప్ప్పు అని హెచ్చరించారు. కార్పొరేట్ వైద్య సేవలు సామాన్యులకు అందని స్థితికి చేరుకున్నాయని, అనవసర పరీక్షలు, మందులు సూచించి వ్యాపార దృష్టితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్`2010 చట్టానికి విరుద్ధంగా కార్పొరేట్ ఆసుపత్రుల కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలు సంపాదించే రూపాయిలో 75 శాతం వైద్య ఖర్చులకే వెళుతున్న దుస్థితి నెలకొందన్నారు. ఫార్మా కంపెనీలు లాభాపేక్షతో నాణ్యతా ప్రమాణాలను విస్మరిస్తున్నాయని, ప్రజారోగ్యాన్ని వ్యాపారంగా మార్చే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షిప్ (పీపీపీ) పేరిట వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే చర్యలు ప్రభుత్వం చేపడుతోందని, దీనివల్ల ప్రభుత్వ వైద్య సంస్థలు నిర్వీర్యమవుతున్నాయని విమర్శించారు. ఆర్టికల్ 21 ప్రకారం ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత అని గుర్తుచేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మరణించిన వారికి కూడా చికిత్స పేరుతో డబ్బులు వసూలు చేసిన ఘటనలు వెలుగులోకి రావడం విచారకరమన్నారు. డయాగ్నస్టిక్ సెంటర్ల పేరుతో కమీషన్ల కోసం ప్రజలను దోచుకుంటున్నారన్నారు. రోగాల వారీగా చికిత్స ఖర్చులు, మందుల ధరలు, ఫీజులు నిర్ధారించే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14 న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ప్రజా ఉద్యమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12 న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటించి, సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించిందని, 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చిందని, కార్పొరేట్ ప్రయోజనాల కోసమే చట్టాలు మార్పు చేశారని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలు దేశాన్ని డంపింగ్ యార్డ్‌గా మార్చే ప్రమాదం ఉందని ఈశ్వరయ్య అన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేసి భవిష్యత్‌లో నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ అంశాలపై ఈ నెల 12 న జరగనున్న సార్వత్రిక సమ్మెలో 550 కి పైగా కార్మిక, రైతు సంఘాలు పాల్గొంటున్నాయని తెలిపారు. సీపీఐ శ్రేణులు, ప్రజా సంఘాలు విస్తృతంగా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ రెడ్డి, పి.దుర్గాభవాని, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *