. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు
. ఉన్నత జీవనస్థితి కల్పిస్తాం: అధికార పక్షం
. రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి వ్యతిరేకం: బీఆరఎస్
. ప్రక్షాళనపై అట్టుడికిన శాసనసభ
విశాలాంధ్ర – హైదరాబాద్: మూసీ ప్రాజెక్టుపై శాసనసభ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మూసీ ప్రక్షాళనపై వాదోపవాదాలు జరిగాయి. మూడోరోజైన బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. మూసీ ప్రక్షాళన చేసి పరీవాహక ప్రజలకు ఉన్నతమైన జీవనస్థితి కల్పిస్తామని అధికార కాంగ్రెస్ చెబుతుండగా, మూసీ ప్రాజెక్ట్ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి పాల్పడుతున్నందునే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆరఎస్ చెప్పింది. ప్రధానంగా మూసీ అభివృద్ధిపైనే కాంగ్రెస్-బీఆరఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మూసీ డీపీఆర్‌పై మాట్లాడిన మంత్రి శ్రీధర్‌బాబు సమాధానంతో సంతృప్తి చెందని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… మంత్రి సమాధానం స్పష్టంగాను, సంతృప్తికరంగానూ లేదని సభ నుంచి వాకౌట్ చేశారు. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. ‘ప్రభుత్వం దగ్గర నిధులు లేవు.. ప్రణాళికలు లేవు. ఏడీబీ రుణం ఇవ్వలేదు. రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి మేం వ్యతిరేకం. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ కీలక అంశాలపై కేటీఆర్ సహా బీఆరఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీశారు.
సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్నాం: భట్టి
మూసీ పరివాహక ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో జీవిస్తున్నారని, వారి జీవన స్థితిగతులను మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మూసీ అభివృద్ధికి అడ్డుపడుతూ పేదలు పేదలుగానే ఉండాలని కోరుకుంటున్నారా అని ప్రతిపక్షాన్ని నిýదీశారు. ప్రచార ఆర్భాటాలు చేయకుండా, సామాజిక బాధ్యతతోనే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామన్నారు. మూసీ రక్షణలో భాగంగా మొదట గాంధీ సరోవర్ నిర్వహిస్తున్నామని, నిర్మాణాత్మక సలహాలు ఉంటే ఇవ్వాలని సూచించారు. తొలుత కేటీఆర్… ప్రశ్నోత్తరాల్లో మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మూసీ పరీవాహక ప్రాంతంలో ఎంతమంది నివసిస్తున్నారో అంత మందికి పునరావాసం కల్పిస్తామని, వారికి ఇళ్ల పట్టా ఉందా లేదా అని చూడమని స్పష్టం చేశారు. బీఆరఎస్ నేతలు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారా లేదో స్పష్టం చేయాలని, పేదలు మురికి కూపంలో ఉండాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తోందని, మూసీ నిర్వాసిత బిడ్డల కోసం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఆ ప్రాంతంలోనే నిర్మించడంతో పాటు మెరుగైన ఆసుపత్రులు అక్కడే నిర్మిస్తామన్నారు. మూసీ ప్రక్షాళన ఒక మహా యజ్ఞమని, ప్రతి చోట ఎస్టీపీలు ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేసిన తర్వాతే నదిలోకి వదులుతామని పేర్కొన్నారు. బీఆరఎస్ నేతల మాదిరిగా మేం ప్రచార ఆర్భాటం చేయమని, మూసీ ప్రాజెక్టు వివరాలన్నీ వెబ్సైట్లో ఉన్నాయి, ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు, మంచి సలహాలు ఉంటే స్వీకరిస్తామని వెల్లడించారు.
డీపీఆర్ సిద్ధం: మంత్రి శ్రీధర్‌బాబు
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఫిబ్రవరి, 2026లో మొదటి దశ డీపీఆర్ సిద్ధమైందని తెలిపారు. గత బీఆరఎస్ ప్రభుత్వం 2016లో 50 మీటర్ల బఫర్ జోన్‌పై ఇచ్చిన జీవోనే తాము అమలు చేస్తున్నామని, వచ్చే బోర్డు సమావేశంలో ఏడీబీ ఆమోదం లభించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన పనులను తాము ఆపలేదని కూడా స్పష్టం చేశారు. అంచనా వ్యయం రూ.6,500 కోట్ల నుంచి రూ.7000 కోట్లుగా చెప్పారు. ఈ ప్రాజెక్టుతో 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశముందన్నారు. తుది ఎన్యుమరేషన్ కొనసాగుతోందని చెప్పారు. బఫర్ జోన్లో ఉన్నవారికి టీడీఆర్ ఇస్తామని… 2013 చట్టం ప్రకారం అవసరమైన భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపడతామని మంత్రి వివరించారు.
ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదు: కేటీఆర్
అనంతరం బీఆరఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ … మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం సంతృప్తిగా లేదన్నారు. ‘డీపీఆర్ తయారీకి 18 నెలలు పడుతుందని జనవరిలో చెప్పారు. పాకిస్థాన్‌లో నిషేధించిన కంపెనీకి అవకాశం ఇచ్చారు. డీపీఆర్‌ను సభ ముందు పెట్టాలి. రుణానికి ఏడీబీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు గతంలో సభలో మంత్రి తెలిపారు. కానీ… డీపీఆర్ ఇవ్వలేదని… రుణం మంజూరు చేయలేదని ఏడీబీ స్పష్టం చేసింది. సభను, ప్రజలను తప్ప్పుదోవ పట్టిస్తున్నారా అని ప్రశ్నించారు. రూ.16వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి రూ.లక్షన్నర కోట్లు అని చెప్పారు. మొదటి దశ రూ.ఏడువేల కోట్లు అంటున్నారు.. ఇంకా ఎన్ని దశలు ఉంటాయి… ఎన్ని నివాసాలు కూలుస్తారు… మంత్రి 1,435 నిర్మాణాలు అన్నారు.. గెజిట్‌లో 10 వేల నిర్మాణాలు అని పేర్కొన్నారు. వీటిలో ఏది నిజం… మూసీ ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదు.. అందులో జరుగుతున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ నదిని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్ పార్టీయేనని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు అదే పార్టీ ప్రజల పేరుతో భారీ ప్రాజెక్ట్ పేరుతో అవినీతి చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వద్ద డీపీఆర్ ఉంటే వెంటనే సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ నగర్‌కు నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ అస్పష్టతకు నిదర్శనమని విమర్శించారు.
ఈ సందర్భంగా బీఆరఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, బండారు లక్ష్మారెడ్డి కలిసి మూసీ ప్రాజెక్టుపై అనేక సందేహాలను లేవనెత్తారు. ముఖ్యమంత్రి ఒకవైపు రూ.లక్షన్నర కోట్లు అంటుండగా, సభలో మాత్రం నాలుగు, ఐదు వేల కోట్లు అని చెప్పడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు.
బఫర్ జోన్‌ను విస్తరించామని స్థానిక ఆర్డీవో చెబుతున్నారని, అసలు బఫర్ జోన్ ఎంత వరకు పెంచారో, దానికి ప్రమాణాలు ఏమిటో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్ట్ పేరిట ప్రజల ఆస్తులు, ఇళ్లు, జీవనోపాధిపై దెబ్బతీసే చర్యలను బీఆరఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని, పారదర్శకత లేకుండా తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సైతం డీపీఆర్ లేదని చెబుతున్నారని తెలిపారు.
The post ‘మూసీ’పై మంటలు appeared first on Visalaandhra.


