మూడు గ్రామాలు.. 2000 మందికి పైగా మర్చంట్ నేవీ ఉద్యోగులు.. ఈ గ్రామాలు చాలా స్పెషల్..! Srikakulam three villages emerge as Merchant Navy hub. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)


Last Updated:

శ్రీకాకుళం కలింగపట్నం బంధారువనిపేట కె మత్స్యలేశ్వరం నుంచి 2000 మందికి పైగా మర్చంట్ నేవీలో కెప్టెన్ స్థాయి వరకు ఎదిగి గ్రామాల ఆర్థిక సామాజిక రూపు మార్చిన గాథ.

+

ప్రతి

ప్రతి ఇంటి నుంచి సముద్రయానం  2000 మంది సీమాన్స్ఉద్యోగులతో ప్రత్యేక

శ్రీకాకుళం జిల్లాలోని కలింగపట్నం, బంధారువనిపేట, కె.మత్స్యలేశ్వరం గ్రామాలు.. మర్చంట్ నేవీ గ్రామాలుగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. ఈ మూడు గ్రామాల నుంచి సుమారు 2000 మందికి పైగా యువతీ యువకులు మర్చంట్ నేవీలో వివిధ హోదాల్లో పనిచేస్తుండటం విశేషం. ఫిమేల్ సీమన్ స్థాయి నుంచి కెప్టెన్ హోదా వరకు ఎదిగిన వారు ఈ గ్రామాల్లో ఉండటం ఈ ప్రాంత అభివృద్ధికి గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. ప్రతి ఇంటి నుంచి ఒకరు లేదా ఇద్దరు షిప్పింగ్ రంగంలో పనిచేయడం ఈ గ్రామాల ప్రత్యేకత.

ఈ విజయగాథకు మూలం స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రారంభమైన ఒక చిన్న ప్రయత్నం. కొమరం శంకర అనే వ్యక్తి ఈ గ్రామం నుంచి మొదటిసారి సీమన్‌గా వెళ్లిన వారిలో ఒకరు. ఆయన సముద్రయానంలో పనిచేసి తిరిగి గ్రామానికి వచ్చాక, అక్కడి ప్రజలకు ఈ ఉద్యోగంపై అవగాహన కల్పించారు. అప్పట్లో బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న మూఢనమ్మకాలు ప్రజల్లో బలంగా ఉండేవి. పడవ ఎక్కితే ప్రమాదం, ప్రాణాలు పోతాయి అనే భయంతో చాలామంది ఈ రంగానికి దూరంగా ఉండేవారు.

అయితే, కొమరం శంకర ఈ అపోహలను తొలగించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన స్వయంగా తన అనుభవాన్ని గ్రామస్తులతో పంచుకుంటూ, మర్చంట్ నేవీ ఉద్యోగం ఎంత సురక్షితమో, ఎంత ఆదాయం పొందవచ్చో వివరించారు. అవసరమైన సర్టిఫికేట్లు, శిక్షణ, అవకాశాల గురించి చెప్పి యువతలో నమ్మకం పెంచారు. ఆయన చూపిన మార్గం వల్లే ఈ గ్రామాల్లో మర్చంట్ నేవీ రంగంపై ఆసక్తి పెరిగింది.

తరువాత ఆయన అడుగుజాడల్లో కీర్తిశేషులు మైలపల్లి కామరాజు మాస్టర్ గారు, దుమ్మ అచ్చయ్య గారు, మైలపల్లి సూర్యనారాయణ గారు వంటి వ్యక్తులు కూడా గ్రామస్తులకు మార్గనిర్దేశం చేశారు. ఈ మహనీయులు యువతకు సరైన దిశ చూపించి, శిక్షణ తీసుకునే విధానం, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. వారి కృషి వల్ల గ్రామాల్లోని యువత పెద్ద ఎత్తున మర్చంట్ నేవీ వైపు మొగ్గుచూపారు.

ప్రస్తుతం ఈ మూడు గ్రామాల్లో ఉన్న యువతలో చాలామంది ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యలు పూర్తి చేసి, మర్చంట్ నేవీలో ఉన్నత హోదాల్లో పనిచేస్తున్నారు. ఫిమేల్ సీమన్ నుంచి కెప్టెన్ వరకు వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు పొందుతూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. దీంతో వారి కుటుంబాల ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోయింది. గ్రామాల్లో మంచి ఇళ్ల నిర్మాణం, విద్యావకాశాలు, జీవన ప్రమాణాలు మెరుగుపడటం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ విధంగా, ఒక వ్యక్తి చూపిన మార్గం, తరువాతి నాయకుల కృషి కలిసి మూడు గ్రామాల భవిష్యత్తును మార్చాయి. నేడు ఈ గ్రామాలు మర్చంట్ నేవీ రంగంలో ఆదర్శంగా నిలుస్తూ, ఇతర ప్రాంతాల యువతకు కూడా ప్రేరణగా మారుతున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *