
*కార్పొరేషన్లలో పెరిగిన స్థానాలు
*నేతల్లో మొదలైన లెక్కలు
*పునర్విభజనతో మారనున్న రాజకీయ ముఖచిత్రం
*తిరుపతిలో 66, చిత్తూరులో 60 వార్డులకు పెంపు
*మరింత వేడెక్కనున్న మున్సిపల్ ఎన్నికల రాజకీయం
విశాలాంధ్ర-చిత్తూరు : మున్సిపల్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను సవరిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం-1955, ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ల రూల్స్-2005 ప్రకారం ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ పరిపాలనాపరమైన నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ సమీకరణలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
తిరుపతి, చిత్తూరులో మారుతున్న సమీకరణలు
ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతి, జిల్లా కేంద్రం చిత్తూరులో వార్డుల సంఖ్య పెరగడం స్థానిక రాజకీయ నేతల్లో కొత్త ఆశలను, మరికొందరిలో ఆందోళనను రేకెత్తిస్తోంది. తిరుపతిలో ప్రస్తుతం ఉన్న 50 వార్డుల సంఖ్య ఏకంగా 66కు పెరిగింది. 16 కొత్త వార్డులు అందుబాటులోకి రానుండటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఇది ఒక సువర్ణావకాశంగా మారనుంది. చిత్తూరులో కూడా 50 వార్డుల నుండి 60కి సంఖ్య పెరగడంతో, కొత్తగా ఏర్పడే 10 వార్డులలో తమ పట్టు నిలుపుకోవాలని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
ఆశావహుల సందడి
వార్డుల సంఖ్య పెరగడంతో ఎప్పటి నుండో కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్న యువ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు కొత్త ద్వారాలు తెరుచుకున్నట్లయింది. ముఖ్యంగా గతంలో రిజర్వేషన్ల కారణంగా పోటీకి దూరమైన అభ్యర్థులు, ఇప్పుడు పెరిగిన వార్డులలో తమకు అనుకూలమైన స్థానం కోసం ఇప్పటి నుండే పైరవీలు మొదలుపెట్టారు. మరోవైపు, ఉన్న వార్డులను విభజించి కొత్త వాటిని ఏర్పాటు చేయడం వల్ల ‘సిట్టింగ్’ కార్పొరేటర్లలో వణుకు మొదలైంది. తమకు పట్టున్న ప్రాంతాలు ఏ వార్డులోకి వెళ్తాయో, రిజర్వేషన్లు ఎలా మారుతాయో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. వార్డు సరిహద్దుల మార్పు వల్ల ఓటు బ్యాంక్ దెబ్బతినే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు.
రాజకీయ కోణంలో లాభనష్టాలు
వార్డుల పెంపు నిర్ణయం అధికార, ప్రతిపక్ష పార్టీలకు సవాల్‌గా మారింది. పెరిగిన వార్డుల ద్వారా మరిన్ని కొత్త ముఖాలను రంగంలోకి దించి, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను సంతృప్తి పరచాలని అధికార పార్టీ భావిస్తోంది. తద్వారా మేయర్ పీఠాన్ని సులువుగా దక్కించుకోవచ్చని లెక్కలు వేస్తోంది. వార్డుల విభజన ప్రక్రియలో తమకు పట్టున్న ప్రాంతాలను విడదీయకుండా చూడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడే వార్డుల్లో బలమైన అభ్యర్థులను వెతకడం వారికి ఇప్పుడు సవాల్‌గా మారింది.
గెజిట్ నోటిఫికేషన్ అంకం
ఈ నూతన వార్డుల సంఖ్యపై ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ ప్రచురణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే వార్డుల సరిహద్దుల నిర్ణయం, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ మొదలుకానుంది. ఏదేమైనా, వార్డుల పెంపు నిర్ణయంతో మున్సిపల్ ఎన్నికల రంగం ముందే సిద్ధమైందని చెప్పవచ్చు. గల్లీ రాజకీయాల నుండి జిల్లా స్థాయి నేతల వరకు అందరి చూపు ఇప్పుడు ఈ కొత్త వార్డుల పైనే ఉంది.


