*జీవీఎంసీలో అత్యధికంగా 120కి చేరిన వార్డులు
*తిరుపతి 66, చిత్తూరు 60 వార్డులుగా ఖరారు
*ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ పరిపాలన శాఖ
విశాలాంధ్ర-చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను పెంచుతూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, పలు కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను సవరిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రస్తుతం ఉన్న వార్డుల సంఖ్యను పెంచారు. మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, 1955… ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల రూల్స్, 2005 ప్రకారం తనకు దఖలు పరచబడిన అధికారాలతో కమిషనర్ ఈ కొత్త వార్డుల సంఖ్యను ఖరారు చేశారు. జీవీఎంసీ (విశాఖ)లో ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120కి పెంచారు. విజయవాడలో 64 వార్డుల నుండి 86 వార్డులకు పెరిగింది. గుంటూరులో 57 వార్డుల నుంచి 76కు పెంచారు. నెల్లూరులో 54 వార్డుల నుంచి 72కు …కర్నూలులో 52 వార్డుల నుంచి 68కు…తిరుపతి, కడప ఈ రెండు కార్పొరేషన్లలో 50 వార్డుల నుంచి 66కు… చిత్తూరు, మచిలీపట్నంలో 50 వార్డుల నుంచి 60కి వార్డుల సంఖ్య పెరిగింది. ఏలూరు, అనంతపురం, ఒంగోలు, విజయనగరం ఈ నాలుగు కార్పొరేషన్లలో 50 వార్డుల నుండి 62 వార్డులకు పెంచారు. ఈ నూతన వార్డుల సంఖ్యకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ అసాధారణ గెజిట్ లో ప్రచురించాలని కమిషనర్ స్టేషనరీ, ప్రింటింగ్ విభాగాన్ని ఆదేశించారు. సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు పెరిగిన వార్డుల సంఖ్యకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఉత్తర్వుల ప్రతిని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శికి, సంబంధిత జిల్లాల కలెక్టర్లకు, మున్సిపల్ మేయర్లకు సమాచారం నిమిత్తం పంపినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఈ వార్డుల పెంపు నిర్ణయం అత్యంత కీలకం కానుంది.


