పునర్విభజనలో పక్కన పెడితే ఉద్యమాలు తప్పవు – సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు హెచ్చరిక
విశాలాంధ్ర, ముదిగుబ్బ,శ్రీ సత్యసాయి జిల్లా : మండల కేంద్రమైన ముదిగుబ్బ పట్టణాన్ని ప్రత్యేక నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ముదిగుబ్బను తిరిగి కదిరి నియోజకవర్గంలో విలీనం చేసే అవకాశాలపై వస్తున్న వార్తలు మండల ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.
ముదిగుబ్బ మండలం విస్తీర్ణం, జనాభా పరంగా జిల్లాలోనే ప్రధాన స్థానంలో ఉందని, సుమారు 65 వేల జనాభా, 48 వేల ఓటర్లు, 25 గ్రామపంచాయతీలు, 86 గ్రామాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముదిగుబ్బ పట్టణంలోనే దాదాపు 20 వేల జనాభా నివసిస్తోందని వివరించారు.
జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ రహదారి, ప్రతిపాదిత ముద్దనూరు–ముదిగుబ్బ రైల్వే మార్గం వంటి మౌలిక సదుపాయాలతో ఈ ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి కేంద్రంగా మారే అవకాశముందని తెలిపారు.
కాబట్టి ముదిగుబ్బను కేంద్రంగా తీసుకుని సమీప మండలాలతో కలిసి కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మండల ప్రజలతో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.


