మా నుంచే గూఢచర్యం జరుగుతోంది – Visalaandhra


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌లో అసహనం పెరుగుతోంది. ఇరాన్ ప్రతిఘటనను చూసి మతిపోతోంది. అంచనాలు తారుమారవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదోనన్న అయోమయ స్థితిలో ఉన్నట్లుంది. తాజాగా ఆయన… మాలోనే ఒక గూఢచారి ఉన్నారు, ఇక్కడ నుంచి గూఢచర్యం జరుగుతోందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో ఒక గూఢచారి ఉన్నారని పేర్కొన్నారు. ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ పైలట్‌ను కాపాడేందుకు అమెరికా సైన్యం భారీ ఆపరేషన్ నిర్వహించిన సంగతి విదితమే. అయితే ఈ ఆపరేషన్ వివరాలను గుర్తుతెలియని వ్యక్తి లీక్ చేశారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. యూఎస్ సైన్యం నిర్వహించిన ఆపరేషన్ గురించి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎఫ్-15ఈ విమానం కూలిన తర్వాత ఒక పైలట్‌ను అమెరికా బలగాలు రక్షించాయన్నారు. అయితే, రెండో పైలట్ కోసం బలగాలు ఇంకా గాలిస్తున్నాయని ఓ వార్తాసంస్థ రాసిన కథనంతో ఇరాన్‌కు ఆ విషయం తెలిసిందన్నారు. దీంతో ఆపరేషన్ క్లిష్టతరమైందని చెప్పారు. ఈ వార్త రాసిన జర్నలిస్టుకు ఆ సమాచారం ఎక్కడి నుంచి లభించిందో వెల్లడించాలన్నారు. లేదంటే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరించారు. సమాచారం ఎవరిచ్చారో జర్నలిస్టు చెప్పకపోతే… జైలుకి వెళ్లాల్సివస్తుందని బెదిరించారు.
లీక్‌కు కారణమైన వ్యక్తిని కనిపెట్టేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు. వారు తమలోనే ఉన్నారని పేర్కొన్నారు. అమెరికా దళాలు రెండో పైలట్ కోసం గాలిస్తున్నాయని వార్త ప్రచురితమైన తర్వాతే… ఇరాన్ అప్రమత్తమైందన్నారు. ఆ పైలట్‌ను పట్టుకున్నవారికి భారీగా బహుమతి అందజేస్తామని ఆ దేశం బహిరంగ ప్రకటన జారీ చేసిందన్నారు. దీంతో తమ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందన్నారు. గూఢచర్యానికి పాల్పడిన వ్యక్తిని మానసిక రోగిగా ట్రంప్ అభివర్ణించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *