మావోయిస్టుల పేరుతో మంత్రులకు బెదిరింపులు – Visalaandhra


అవి నిజమైనవి కాకపోవచ్చన్న మంత్రి దుర్గేశ్

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో ఒకేసారి నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. ఈ లేఖలు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన మంత్రులకు రావడం గమనార్హం. టీడీపీకి చెందిన అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, జనసేనకు చెందిన కందుల దుర్గేశ్, బీజేపీకి చెందిన సత్యకుమార్‌లకు ఈ లేఖలు అందినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ లేఖలు బయటకు రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై అసెంబ్లీలో లాబీలో పర్యాటక శాఖా మంత్రి మంత్రి కందుల దుర్గేశ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆయన నిజమేనని అంగీకరించారు. అయితే తమకు మావోయిస్టులు లేఖ రాయాల్సినంత హడావుడి ఏముంది? అని లేఖలను తేలిగ్గా కొట్టిపారేశారు. వ్యక్తిగతంగా, శాఖాపరంగా తామెలాంటి తప్పులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ లేఖలు రాసి ఉంటారన్నారు.
అయితే ఈ లేఖతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారని తెలిపారు. బంధువులు, స్నేహితులు కూడా కొందరు ఫోన్ చేసి లేఖ బెదిరింపులకు వాస్తవ సమాచారం కోసం ఆరా తీశారని చెప్పారు. ఇవి బెదిరింపు లేఖలా? మావోయిస్టు లేఖలా? అనేది దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. మంత్రుల భద్రతాపరమైన అంశాలపై పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే మంత్రి కందుల దుర్గేశ్ వ్యక్తిగత సహాయకుడు.. ఈ బెదిరింపు లేఖపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *