మార్చి నుంచే మండిపోతున్న ఎండలు.. ఈ జిల్లాల్లో వడగాలుల అలర్ట్..! Heat intensity increases in the state from March to May Prakhar Jain | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


మార్చి నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు ఎక్కువ రోజులు వీచవచ్చని పేర్కొన్నారు. మార్చి నుంచి మే వరకు పరిశీలిస్తే శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఎండల తీవ్రత దృష్ట్యా విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు చర్యలు చేపడుతోందని ప్రఖర్ జైన్ తెలిపారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఉష్ణోగ్రతలు, వడగాలుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, జిల్లా యంత్రాంగానికి రెండు రోజుల ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తామని చెప్పారు. రియల్ టైమ్‌లో మండల అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తామని స్పష్టం చేశారు. ఎండల సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 18004250101లను సంప్రదించాలని సూచించారు. వడగాలుల హెచ్చరిక సందేశాలు అందిన వెంటనే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఆకస్మిక భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశమున్నందున చెట్ల కింద నిలవకూడదని హెచ్చరించారు.

ఎండ తీవ్రతను తట్టుకునేందుకు ప్రజలు కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇంటి పైకప్పులపై తెలుపు రంగు పూత, చల్లని పైకప్పు సాంకేతికత, గాలి సరిగా వచ్చేందుకు ఎదురెదురు కిటికీలు, తాపన నిరోధక పదార్థాలు వంటివి ఉపయోగించాలని తెలిపారు. మేడపై, ఇంటి లోపల మొక్కలు పెంచడం వల్ల భవనం చల్లగా ఉంటుందని చెప్పారు. వంటగది తలుపులు, కిటికీలు తెరిచి గాలి ఆడేలా చూడాలని సూచించారు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా గొడుగు వాడాలని, తెలుపు రంగు పలుచటి పత్తి దుస్తులు ధరించాలని, తల కప్పుకోవాలని, కళ్ల రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించాలని సూచించారు.

గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. శరీరం నీరసం కాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ద్రావణం, లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవపానీయాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. మంచినీరు సమృద్ధిగా తాగడం ద్వారా డీహైడ్రేషన్ నివారించవచ్చని తెలిపారు. ఎండల తీవ్రతను లెక్కచేయకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమని, అందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *