​మహిళా సాధికారతతోనే సమాజ వికాసం: ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ లక్ష్మణరావు


విశాలాంధ్ర-​రాప్తాడు : మహిళా సాధికారత, సమానత్వం, గౌరవం ప్రతి మహిళా స్వతంత్రంగా పొందే హక్కు అని, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పురుషులపై ఉందని ఆర్డీటీ బుక్కరాయసముద్రం రీజినల్ డైరెక్టర్ లక్ష్మణరావు పేర్కొన్నారు. శుక్రవారం రాప్తాడు ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీసులో అనంతసిరి మహిళా కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల నెట్‌వర్క్ లీడర్లతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంత సిరి మహిళా కో-ఆపరేటివ్ బ్యాంక్ బోర్డ్ డైరెక్టర్ అనూరాధ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మణరావు మాట్లాడుతూ, ఇంట్లో పనుల నుంచి బయటి పనుల వరకు బాలబాలికలు సమానంగా చేయగలరనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు.
​ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్ భాగ్యమ్మ మాట్లాడుతూ, ఒంటరి మహిళగా సమాజంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన పిల్లలను చదివించానని, ఈరోజు తన కుమార్తె హైదరాబాద్‌లో డాక్టర్‌గా స్థిరపడటం ఎంతో గర్వంగా ఉందన్నారు. అనంతరం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారని కొనియాడారు.
​వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి లక్ష్మి (తాటిచెర్ల), ద్వితీయ బహుమతి మంగమ్మ (ఉప్పరపల్లి), తృతీయ బహుమతి లక్ష్మీనరసమ్మ (రామినేపల్లి) అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అనంతసిరి మహిళా కో-ఆపరేటివ్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, నెట్‌వర్క్ లీడర్లు, సి.ఓ.లు మల్లికార్జున, సాయిలీల, ఏరియా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *