. సామాజిక బహిష్కరణలు… మూకుమ్మడి దాడులు… పంటకు నిప్ప్పు
. కళ్లప్పగించి చూస్తున్న పోలీసు, రెవెన్యూ యంత్రాంగం
. రాష్ట్రపతి భవన్, ఎస్టీ కమిషన్ నోటీసులు పట్టించుకోని వైనం
. రంపచోడవరంలో పనిచేయని గిరిజన చట్టాలు, ప్రత్యేక రక్షణ వ్యవస్థ
. నిందితులను అరెస్ట్ చేయాలి: గిరిజన సంఘాల డిమాండ్
విశాలాంధ్ర బ్యూరో -రంపచోడవరం: గిరిజన చట్టాలు, ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో చట్టం చుట్టపుచూపుగా మారింది. పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలో కొన్ని కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న వరుస దాడులు, సామాజిక బహిష్కరణలు (వెలి) చూస్తుంటే అక్కడ అసలు ప్రభుత్వం ఉందా అనే సందేహం కలుగుతోంది. సామాన్యుడికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో బాధితులు ఏకంగా రాష్ట్రపతి భవనాన్ని, జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రంపచోడవరం మండలం దిరిసనపల్లి గ్రామానికి చెందిన బల్లెం గంగాభవాని ఉదంతం ఏజెన్సీలో పాలన ఎంత అధ్వానంగా ఉందో దీనికి నిదర్శనం. గ్రామంలోని కొందరు పెద్దమనుషులు ఆమెను సామాజికంగా బహిష్కరించి, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ అరాచకంపై ఆధారాలతో సహా స్థానిక పోలీసులకు, ఐటీడీఏ పీఓకు, జిల్లా కలెక్టర్‌కు ‘పిజిఆరఎస’ ద్వారా అనేకమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. కిందిస్థాయి అధికారులు ఈ ఫిర్యాదులను బుట్టదాఖలు చేయడంతో బాధితురాలు గత్యంతరం లేక జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్, రాష్ట్రపతి భవనం వరకు వెళ్లారు. అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి నోటీసులు జారీ అయినా… క్షేత్రస్థాయిలో విచారణ అడుగు ముందుకు పడకపోవడం వెనుక ఉన్న ‘అదృశ్య శక్తులు’ ఎవరనేది ఇప్ప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు దిరిసనపల్లి ఉదంతం నలుగుతుండగానే, అదే మండలం నరసాపురంలో మరో దారుణం చోటుచేసుకుంది. పోడియం అరుణకుమారి, మరికొందరిపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా, వారి ఇళ్లల్లోకి అక్రమంగా చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇది చాలదన్నట్లు, అదే గ్రామానికి చెందిన కోటం పండమ్మ, కోసు రామన్న దొరలకు చెందిన జీడి మామిడి తోటలను లక్ష్యంగా చేసుకుని రెండు రోజుల వ్యవధిలోనే వారి తోటలకు దుండగులు నిప్ప్పుపెట్టి ఏళ్ల తరబడి కష్టపడి పెంచిన పంటను బూడిద చేశారు. ఆర్థికంగా దెబ్బతీయడం ద్వారా ఆ కుటుంబాలను గ్రామం నుంచి తరిమేయాలనే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వరుస ఘటనలపై స్థానిక పోలీస్ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదులు చేసినా, కనీసం ఎఫఐఆర్ నమోదు చేయడానికి లేదా నిందితులను అదుపులోకి తీసుకోవడానికి వెనకాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం అమలు కాకపోవడంతో బాధితులు చివరకు న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ దుర్ఘటనలపై జిల్లాలోని గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు కుంజ శ్రీను … నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి భవన్, ఎస్టీ కమిషన్ ఇచ్చిన నోటీసులపై తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక బహిర్గతం చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి, వారికి రక్షణ కల్పించాలన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న స్థానిక అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజనుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ, అవి కాగితాలకే పరిమితం కావడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రంపచోడవరం మండలంలో శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. తమ గ్రామాలను సందర్శించి వాస్తవ పరిస్థితులు తెలుసుకొని తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితులు వేడుకుంటున్నారు.


