. మద్యం కేసులో కీలక నిందితుల విచారణ
. త్వరలో మరికొందరికి నోటీసులిచ్చే అవకాశం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెప్పబడుతున్న ఈ భారీ కుంభకోణంలో వేల కోట్ల రూపాయల మేర అవినీతి, అక్రమాలు, కమీషన్ల పంపకాలు, మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న ధనుంజయరెడ్డి, కష్ణమోహన్రెడ్డి, చాణక్య, వెంకటేశ్ నాయుడు సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన విచారణలో మద్యం టెండర్ల ప్రక్రియ, నిధుల మళ్లింపుపై కష్ణమోహన్రెడ్డిని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. కృష్ణమోహన్ రెడ్డి తన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులకు అందజేసినట్లు తెలిసింది.
దర్యాప్తులో భాగంగా అవసరమైనప్పుడు మళ్లీ హాజరుకావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అందుబాటులో ఉండాలని ఈడీ ఆయనను ఆదేశించింది. మిగిలిన నిందితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర సీఐడీ, సిట్ గతంలో సమర్పించిన ప్రాథమిక నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన ఈడీ… ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున ఆస్తుల జప్తు చర్యలు చేపట్టింది. ప్రధాన నిందితులైన రాజ్ కసిరెడ్డి, చాణక్య, వాసుదేవరెడ్డికి చెందిన సుమారు రూ. 441 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. మద్యం పాలసీ రూపకల్పనలో జరిగిన లొసుగులు, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ప్రైవేటు వ్యక్తులకు చేకూరిన ప్రయోజనాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణలో భాగంగా మరికొందరు ఐఏఎస్ అధికారులు, రాజకీయ ప్రముఖులకు కూడా నోటీసులు అందే అవకాశం ఉండటంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
The post మద్యం కేసులోఈడీ దూకుడు appeared first on Visalaandhra.


