విశాలాంధ్ర, ఉరవకొండ (అంతపురం జిల్లా) : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, మరియు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసుల కృషి వల్ల ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో కొలిమి లేఔట్ పయ్యావుల కాలనీ ఒకటిలో తాగునీటి సమస్య పరిష్కారమైనట్లు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు మరియు పీఏసీ చైర్మన్ ప్యారం కేశవానంద, పెన్నహోబిలం దేవాలయం చైర్మన్ రేగటి నాగరాజు, ఉరవకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్ తెలిపారు. మంగళవారం పయ్యావుల కాలనీలో తాగునీటి కొళాయిలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొలిమి లేఔట్ నందు తాగునీటి కోసం ఆ కాలనీ ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ తక్షణమే స్పందించి మండల పరిషత్ మరియు ఉరవకొండ గ్రామపంచాయతీ నిధులు రూ, 4.80 లక్షలను మంజూరు చేయించారని వారు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన తాగునీటి పైప్ లైన్లు నిర్మాణ పనులు చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీకి చెందిన వార్డు సభ్యులు, కాలనీ ప్రజలు మాట్లాడుతూ, మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయడంతోనే ఈ పనులు వేగంగా పూర్తయ్యాయని తెలిపారు. ఈ సదుపాయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, మంత్రి మరియు అధికారులకు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుంకరత్నమ్మ, మాజీ సర్పంచ్ గోవిందు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీ ప్రజలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


