మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన న్యాయవాదికి ఆల్కహాల్ టెస్టు…


గాయని మంగ్లీ (సత్యవతి), న్యాయవాది సింగపోగు సుబ్బారావు మధ్య నడుస్తున్న పరస్పర ఆరోపణల వివాదం మరో మలుపు తిరిగింది. మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సుబ్బారావుకు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ (డ్రంకెన్) టెస్ట్ నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ పరీక్షలో ఆయన రక్తంలో27 mg/100ml ఆల్కహాల్ ఉన్నట్లు రీడింగ్ నమోదైంది.

వివరాల్లోకి వెళితే.. మైక్రోఫైనాన్స్ పేరుతో మంగ్లీ, ఆమె సోదరుడు రూ.10 కోట్లకు మోసం చేశారని ఆరోపిస్తూ కొందరు వ్యక్తుల తరఫున ఫిర్యాదు చేసేందుకు సుబ్బారావు మీడియాను వెంటబెట్టుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో సుబ్బారావు ప్రవర్తనపై అనుమానం రావడంతో పాటు, ఆయన నుంచి మద్యం వాసన వస్తుండటంతో పోలీసులు లోపలికి అనుమతించే ముందు డ్రంకెన్ టెస్ట్ చేయించుకోవాలని స్పష్టం చేశారు. దీంతో సుబ్బారావుకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అనంతరం సుబ్బారావుకు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో 27 పాయింట్లు నమోదు కావడంతో స్టేషన్‌లో హైడ్రామా నెలకొంది. అయితే, ఇది డ్రైవింగ్‌కు నిర్దేశించిన చట్టపరమైన పరిమితి లోపే ఉందని, కానీ పబ్లిక్ ప్లేస్ అయిన పోలీస్ స్టేషన్‌లో అనుమానం వస్తే పరీక్ష నిర్వహించే అధికారం తమకు ఉందని పోలీసులు వివరణ ఇచ్చారు. కాగా, మంగ్లీపై కేసును తప్పుదోవ పట్టించేందుకే పోలీసులు తనను లక్ష్యంగా చేసుకున్నారని సుబ్బారావు ఆరోపించారు.

ఇప్పటికే సుబ్బారావు ఫిర్యాదు మేరకు మంగ్లీపై, ఆమె సోదరుడిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, తనను బ్లాక్‌మెయిల్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేస్తున్నారని సుబ్బారావుపై మంగ్లీ కూడా నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇరుపక్షాల ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *