విశాలాంధ్ర – కంబదూర్ మండలం: కంబదూర్ మండలం తిప్పేపల్లి గ్రామానికి చెందిన ఎరుకల చిరంజీవి తన భార్య జయమ్మతో తరచూ గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. భర్త వేధింపుల కారణంగా జయమ్మ తన అక్క గంగమ్మ వద్దకు వెళ్లి తన బాధను చెప్పుకునేది.ఈ నెల 20వ తేదీన భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ చోటుచేసుకోవడంతో భయపడిన జయమ్మ గ్రామంలో ఎక్కడో దాక్కుంది. ఆమె రాళ్లపల్లి గ్రామంలో ఉన్న తన అక్క గంగమ్మ ఇంటికి వెళ్లి ఉంటుందని అనుమానించిన చిరంజీవి అర్ధరాత్రి సమయంలో అక్కడికి చేరుకున్నాడు.ఇంట్లో నిద్రిస్తున్న గంగమ్మను లేపి గొడ్డలితో తలపై దాడి చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.గాయపడిన గంగమ్మను మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు చిరంజీవి కోసం గాలింపు చేపట్టి, స్థానికుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచినట్లు ఎస్ఐ లోకేష్ కుమార్ తెలిపారు.


