భారత మాతను మోదీ సర్కార్అమ్మేసింది – Visalaandhra


. గంపగుత్తగా అమెరికాకు అప్పగించారు
. వాణిజ్య ఒప్పందం వల్ల వారికే మేలు
. దేశ ఇంధన భద్రత, రైతుల ప్రయోజనాలకు తీవ్ర ముప్పు
. లోక్‌సభలో నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
. దేశాన్ని అమ్ముతున్నందుకు ‘సిగ్గుగా లేదా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు

న్యూదిల్లీ: భారత్అ-మెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మోదీసర్కారుపై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఇది “భారత్ మాతను అమ్మడం” లాంటిదని, భారతదేశ ఇంధన భద్రత, రైతుల ప్రయోజనాలను దెబ్బతీయడానికి గంపగుత్తగా అప్పగించడమేనని మండిపడ్డారు. బుధవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడారు. నరేంద్ర మోదీతో సహా ఏ భారత ప్రధానమంత్రి కూడా తన గొంతు నులిమిపట్టకుండా అలాంటి ఒప్పందానికి అంగీకరిస్తారని తాను నమ్మడం లేదన్నారు. ‘అతను (మోదీ) భారతదేశాన్ని ఎందుకు అమ్మేశాడు? ఎందుకంటే వారు (అమెరికా) అతనిని గొంతు పిసికి చంపుతున్నారు. వారికి అతని మెడపై పట్టు ఉంది’ అంటూ రాహుల్ ప్రసంగం ప్రారంభించారు. భారత్ – అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఏకపక్షంగా ఉందని, దీనివల్ల భారత రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ఇది అమల్లోకి వస్తే… భారత మార్కెట్‌లోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ప్రవాహం భారీగా పెరుగుతుందని… భారత రైతులు విలవిలలాడాల్సిన దుస్థితి వస్తుందన్నారు. ఇక భారతదేశ వస్త్ర పరిశ్రమ పని అయిపోయినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాతో ఒప్పందం ఫలితంగా ఇంధన భద్రతను భారత్ కోల్పోయిందన్నారు. ఇకపై ఎవరి నుంచి చమురును కొనాలో అమెరికాయే మనదేశానికి ఆదేశాలిస్తుందని రాహుల్ పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందం చర్చల సందర్భంగా భారత్‌ను సరిసమాన భాగస్వామిగా పరిగణించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కేంద్ర ప్రభుత్వం కోరి ఉండాల్సిందన్నారు. “మీ ప్రభుత్వం భారతదేశాన్ని అమ్మేసింది. దేశాన్ని అమ్ముతున్నందుకు సిగ్గుగా లేదా? మీరు భారతమాతను అమ్మేశారు” అని రాహుల్ మోదీ సర్కారునుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “అంత సాధారణంగా భారత్‌ను ప్రధాని మోదీ అమ్మేస్తారంటే నేను నమ్మను. బహుశా, ఆయనపై ఏదో బయటి ఒత్తిడి ప్రభావం పడి ఉండొచ్చు. ఎప్‌స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయ్యాయని తెలిసినప్పటి నుంచి ప్రధాని మోదీ కళ్లలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. వాటితో ముడిపడిన ఒత్తిడి ప్రభావం ప్రధానిపై పడిందేమో. వాళ్లు ప్రధాని మోదీని ఉక్కిరిబిక్కిరి చేసి ఉండొచ్చు. బెదిరించి ఉండొచ్చు. ఇంకో 30 లక్షలకుపైగా ఎప్‌స్టీన్ ఫైల్స్ తదుపరి విడతల్లో విడుదల కావాల్సి ఉంది. గతంలో భారత వస్తు,ఉత్పత్తులపై అమెరికా 3 శాతం సుంకాన్నే విధించేది. కానీ ఇక నుంచి ఆరు రెట్లు అదనంగా 18 శాతం సుంకాన్ని విధిస్తుందట. ఇక ఇదే సమయంలో అమెరికా సరుకులపై భారత్ విధించే 16 శాతం సుంకాన్ని, సున్నాకు తగ్గిస్తారట. ఎందుకోసం ప్రధాని మోదీ ఇలాంటివన్నీ ఒప్పుకున్నారు ? ప్రస్తుతం అమెరికా నుంచి భారత్ ఏటా 46 బిలియన్ డాలర్లు విలువైన వస్తు, ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. దీన్ని ఏకంగా 100 బిలియన్ డాలర్లు దాటిస్తామని ట్రంప్‌కు మోదీ ఎందుకు హామీ ఇచ్చారు ?” అని రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు. ప్రపంచంలో ఇక యుద్ధాల శకం ముగిసిందని గతంలో ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎనఎసఏ) అజిత్ దోవల్ చెప్పారని… కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. ‘ఆపరేషన్ సిందూర్‌ను గత సంవత్సరమే మనం చూశాం. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం గత మూడేళ్లుగా జరుగుతోంది. ఇజ్రాయిల్ – గజా సైనిక ఘర్షణను యావత్ ప్రపంచం చూసింది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా కుట్రలను ఇప్పుడు చూస్తున్నాం. ఇంధన వనరులు, ఆర్థిక వనరులను ఆయుధాలుగా మలుచుకొని ప్రపంచ దేశాలపై అమెరికా ఒత్తిడిని పెంచుతోంది. అమెరికా ఆధిపత్యాన్ని, దాని డాలరు పెత్తనాన్ని చైనా, రష్యా లాంటి దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అంటే మనం ఏకధ్రువ ప్రపంచం నుంచి బహుళ ధ్రువ ప్రపంచం దిశగా పయనిస్తున్నాం’ అని రాహుల్ పేర్కొన్నారు.
ప్రపంచ దేశాల నడుమ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, అమెరికా ఆధిపత్యాన్ని చైనా, రష్యా లాంటి దేశాలు సవాల్ చేస్తున్నాయని ఆర్థిక సర్వేలో పేర్కొనడం తనకు నచ్చిందని రాహుల్ తెలిపారు. ఇంధన వనరులు, ఆర్థిక వనరులను ఆయుధాలుగా మలిచి దేశాలపై దాడి చేసే పరిస్థితులు ప్రపంచంలో ఏర్పడుతున్నాయని… అందుకే అమెరికా ఆధిపత్యాన్ని, డాలరు పెత్తనాన్ని మనం సవాల్ చేయాలన్నారు. కానీ ఇంధన వనరులు, ఆర్థిక వనరులను ఆయుధాలుగా మలిచి భారత్‌పైకి ప్రయోగించే అవకాశాన్ని అమెరికాకు మోదీ సర్కారు ఇచ్చిందని రాహుల్ దుయ్యబట్టారు. భారత్ ఎవరి నుంచి ముడి చమురును కొనాలనేది మరో దేశం పాలకులు నిర్ణయించాలా ? భారత ప్రయోజనాలను దెబ్బతీసే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నందుకు సిగ్గుగా లేదా ? అని మోదీసర్కారును రాహుల్ నిలదీశారు. “జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు కూడా వచ్చింది. ఇప్పటిదాకా ఆయన్ను ఎందుకు జైలులో పెట్టలేదు? అనిల్ అంబానీని జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు పరిచయం చేసింది ఎవరు? దీనికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సమాధానం చెప్పాలి. ఎప్‌స్టీన్‌కు అనిల్ అంబానీని ఎవరు పరిచయం చేశారో నాకు తెలుసు. ఈవిషయం హర్దీప్ సింగ్‌పూరీకి కూడా తెలుసు. భారతదేశ రక్షణ రంగ బడ్జెట్‌లో కేంద్ర బిందువుగా అదానీ కంపెనీ ఉంది. ఆ కంపెనీ చెప్పినట్టుగానే రక్షణ రంగ బడ్జెట్‌ను కూర్చారు” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
డిజిటల్ ట్రేడ్ నియమాలను పట్టించుకోలేదు…
భారత్‌ను పాకిస్థాన్‌తో అమెరికా పోల్చి చూడటానికి వీల్లేదని రాహుల్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ సైన్యాధిపతి తనతో బ్రేక్ ఫాస్ట్ చేయాలని అమెరికా అధ్యక్షుడు కోరుకుంటే అది జరిగిపోయింది కానీ భారత్ విషయంలో అలా జరగలేదన్నారు. మనం మరోలా జవాబు ఇచ్చామని చెబుతూ… ఇప్పుడు అదే అమెరికాతో అన్యాయమైన వాణిజ్య ఒప్పందం మోదీ ప్రభుత్వం కుదుర్చుకుందని విమర్శించారు. చివరకు డిజిటల్ ట్రేడ్ నియమాలను సైతం అమెరికా కోసం ఫణంగా పెట్టేందుకు మోదీ సర్కారు సిద్ధమైందని మండిపడ్డారు. అమెరికా కంపెనీలు భారత్‌లో డేటా లోకలైజేషన్ చేయాల్సిన అవసరం లేని రూల్‌ను తెచ్చేందుకు ఓకే చెప్పారు. భారత్ నుంచి అమెరికాకు పూర్తి ఉచితంగా డేటా బదిలీకి అనుమతులు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారన్నారు. అమెరికా కంపెనీలపై విధించే డిజిటల్ పన్నును తగ్గించేందుకు కూడా అంగీకరించారని రాహుల్ తెలిపారు. అమెరికా డిజిటల్ కంపెనీలు ఇకపై సోర్స్ కోడ్‌ను భారత సర్కారుకు బహిర్గతపర్చా ల్సిన అవసరం లేని నిబంధన తెచ్చేందుకూ కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. ‘ఆర్థిక మంత్రి నిర్మల బాగా నవ్వుతున్నారు. ఆమెకు నవ్వడం అంటే ఇష్టం. అమెరికా ప్రభుత్వం సూచించే కంపెనీలకు 20 ఏళ్ల పాటు పన్ను లేకుండా ఇచ్చేందుకూ కేంద్రం ఒప్పుకుంది” అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *