. నా జోక్యం లేకుంటే 3.5 కోట్ల మంది ప్రాణాలు పోయేవి
. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటన
వాషింగ్టన్: అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పది నెలల కాలంలోనే తాను ఎన్నో గొప్ప పనులు చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గొప్పలు పోయారు. ఏకంగా 8 యుద్ధాలను ఆపానని పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ ‘స్టేట్ ఆఫ్ యూనియన’ ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఆపిన యుద్ధాలలో భారత్, పాక్ ల మధ్య జరిగిన యుద్ధం అతి ముఖ్యమైందని పునరుద్ఘాటించారు. ‘అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి 10 నెలల్లోనే నేను ఎనిమిది యుద్ధాలు ముంగిచా. కంబోడియా- థాయ్‌లాండ్, పాకిస్థాన్- భారత్ మధ్య అణు యుద్ధం జరిగేదే. నా జోక్యం లేకపోతే 3.5 కోట్ల మంది చనిపోయేవారని పాకిస్థాన్ ప్రధాని అన్నారు. నేను అధ్యక్షుడిగా ఉన్నట్లయితే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదు. రెండు దేశాల మధ్య జరుగుతున్న హింసను ఆపేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే భారత్ యుద్ధాన్ని ప్రస్తావిస్తున్నప్పడు తను లేకపోతే పాక్ ప్రధాని చనిపోయి ఉండేవారని ట్రంప్ నోరు జారారు. కానీ వెంటనే 3.5 కోట్ల మంది యుద్ధంలో చనిపోయేవారని పాక్ ప్రధాని తనతో చెప్పినట్లు వెల్లడించారు. ఇక అమెరికా గతంలో కన్నా బలంగా, మెరుగ్గా, సుసంపన్నంగా మారిందని పేర్కొన్నారు. దేశ ఆర్థికవ్యవస్థ మునుపెన్నడూ లేనివిధంగా పరుగులు పెడుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో దేశాన్ని మరింత మెరుగుపరుస్తామన్నారు. అమెరికాకు ఇది స్వర్ణయుగం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రెండోదఫా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయ్యిందన్నారు. కానీ, ఇది తనకు మూడో దఫా కావాల్సిఉందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం నాలుగేళ్లలో అమెరికాలో 1 ట్రిలియన్ డాలర్ల కంటే తక్కువ పెట్టుబడులు తీసుకొస్తే.. ఒక్క సంవత్సరంలోనే తన కార్యవర్గం 18 ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు సాధించినట్లు తెలిపారు. అక్రమ వలసలను, ప్రాణాంతక ఫెంటనిల్ లను సమర్థవంతంగా అడ్డుకున్నామన్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో నిర్బంధం తర్వాత.. ఆ దేశం నుంచి 80 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు అమెరికాకు వచ్చినట్లు వెల్లడించారు.
ఇరాన్‌కు హెచ్చరిక
ఇరాన్ తన అణు, క్షిపణి సామర్ధ్యాలను పెంపొందించుకునే ప్రయత్నాలను తిరిగి ప్రారంభిస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఇలాంటి వాటికి అనమతించకూడదనేది అమెరికా విధానమని తెలిపారు. అయితే దౌత్యపరమైన పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తానని చెప్పినా, అవసరమైతే కఠిన నిర్ణయాలకు వెనుకాడబోనని హెచ్చరించారు. ‘యూరప్, విదేశాల్లోని మా స్థావరాలను లక్ష్యంగా చేసుకునే క్షిపణులను వారు ఇప్పటికే అభివృద్ధి చేశారు. త్వరలో అమెరికాను కూడా చేరుకునే క్షిపణుల తయారీలో ఉన్నారు. దౌత్యపరంగా సమస్యను పరిష్కరించడమే నా ఉద్దేశం. కానీ ప్రపంచంలో అగ్రగామి ఉగ్రవాద ప్రోత్సాహక దేశానికి అణు ఆయుధాలు కలిగి ఉండటానికి నేను ఎప్పటీ అనుమతించను. అలా జరగకూడదు’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరం
ప్రపంచ దేశాలపై అమెరికా విధించిన సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ దాదాపు అన్ని దేశాలు తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాయని అన్నారు. దశాబ్దాలుగా మనల్ని మోసం చేసిన దేశాలు ఇప్పుడు మనకు వందల బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు. ఆధునిక ఆదాయపు పన్ను వ్యవస్థను భర్తీ చేయడానికి టారిఫ్‌లు విధించినట్లు తెలిపారు. విదేశాలపై మోపిన సుంకాలు అమెరికా ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయన్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్‌తో అమెరికన్లకు ఉపశమనమని ట్రంప్ అభివర్ణించారు. అదే సమయంలో దీనిని వ్యతిరేకించిన డెమొక్రాట్లను తీవ్రంగా విమర్శించారు. ప్రజలను బాధపెట్టడానికి వారు పెద్ద ఎత్తున పన్ను పెంచాలని కోరుకుంటున్నారని అన్నారు.


