భవన నిర్మాణ కార్మికులబానిసత్వం ఇంకెన్నాళ్లు ?


భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం నిర్మాణరంగం. ఈ నిర్మాణ రంగంలో కొన్ని కోట్ల మంది పనులు నిర్వహిస్తున్నారు. కన్‌స్ట్రక్షన్ రంగంలో కార్మికులకు పని ప్రదేశాలలో జరిగే ప్రమాదాల నివారణకు వారి సామాజిక భద్రతకు చట్టాన్ని రూపొందించారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలు చేశాయి. 1990లో ఏఐటియుసి నాయకత్వాలు భవన నిర్మాణ కార్మికుల రక్షణకు, ప్రమాదాల నివారణకు చట్టం అవసరమంటూ గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆందోళనలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం 1996లో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పటి నుంచి కొన్ని రాష్ట్రాలు వేగవంతంగా అమలు చేశాయి. చాలా రాష్ట్రాలలో ఈ చట్టం అమలు చేయాలంటూ ఇంకా పోరాటాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఎట్టకేలకు మన రాష్ట్రంలో 2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి 2006 నుంచి రాష్ట్రంలో బోర్డును ఏర్పాటుచేసి, కార్మిక సంఘాలతో చర్చించి 12 రకాల సౌకర్యాలను ఏర్పాటుచేశారు. 1996 చట్టం ప్రకారం ఐదు లక్షల పైబడి ఏ నిర్మాణాలు జరిగిన ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాల నుంచి సెస్ రూపేణా ఒక శాతం సెస్ కలెక్ట్ చేశారు. ఈ కలెక్షన్ ద్వారా వచ్చిన డబ్బు దాదాపు 2,240 కోట్లు. దీంతో సంక్షేమ బోర్డును ఏర్పాటుచేసి భవన నిర్మాణ కార్మికులను బోర్డులో 22 లక్షల మంది సభ్యులుగా నమోదుచేసుకున్నారు. అప్పటినుంచి భవన నిర్మాణ కార్మికులకు సహజ మరణానికి 30,000, యాక్సిడెంట్ డెత్‌కు 2 లక్షలు, అంగవైకల్యానికి లక్ష వరకు పర్సెంటేజ్‌ను బట్టి ఇచ్చేవారు. మట్టి ఖర్చులకు పది వేలు, భవన నిర్మాణ కార్మికుని భార్య గాని, కుమార్తె గాని డెలివరీ అయితే కాన్పు ఖర్చులకు పది వేలు, పిల్లల స్కాలర్‌షిప్‌లు, భవన నిర్మాణ కార్మికుడు పని ప్రదేశంలో ప్రమాదం జరిగితే దెబ్బలు తగిలిన గాయాలైన మూడు నెలలు హాస్పిటల్ ఖర్చుకు 10,500, కార్మికుడికి కావలసిన టూల్ కిట్ భవన నిర్మాణ కార్మికుల కూతురు వివాహం జరిగినప్పుడు వివాహ కానుక 10,000 ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులు వృత్తినైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇవేగాక కొన్ని రాష్ట్రాలలో ఇంకా ఎక్కువ స్కీములు ప్రవేశపెట్టారు. 2009 నుంచి 2019 వరకు ఈ సంక్షేమ బోర్డులు దేశంలో భవన నిర్మాణ కార్మికులకు ఉపయోగపడింది. ఐతే తరువాత ఈ క్లయిములు పెంచాలని ఆంధ్రలో ఏపీ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కొన్ని వామపక్ష కార్మిక సంఘాలతో కలుపుకుని ఉద్యమించింది. దాని ఫలితంగా 2016 ఫిబ్రవరి 4న ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలను పెంచుతూ ఐదు జీవోలు విడుదల చేసింది. ఆనాటి ప్రభుత్వం సహజ మరణానికి 60,000, మట్టి ఖర్చులకు 20,000, యాక్సిడెంట్ డెత్‌కు ఐదు లక్షలు, వైకల్యానికి 2 లక్షలు ఇచ్చారు. ఆడపిల్ల పెళ్లికి 20,000 కాన్పులకు 20,000 పెంచుతూ జీవో జారీ చేశారు. ఐతే సమస్య 2014లో మొదలైంది. సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బులు 2240 కోట్లు పై ప్రభుత్వ కన్ను పడింది. 2015 సంవత్సరం ఏప్రిల్‌లో 600 కోట్లు చంద్రన్న భీమా పథకానికి డైవర్ట్ చేశారు. అప్పటినుండి ప్రభుత్వాలకు సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బులు ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడం ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చెట్లు తొలగించడానికి, అధికారులకు వాహనాలు కొనడానికి దాదాపు 100 కోట్లు ఖర్చు చేశారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం దీనిపై సీత కన్నేసింది. ఆనాటి లేబర్ కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చి దాదాపు 1200 కోట్లు వైఎసఆర్ బీమాకు డైవర్ట్ చేశారు. ఆనాటి అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అవసరాలకు వాడుకున్నమాట నిజమే. సంక్షేమ బోర్డుకు త్వరలోనే చెల్లిస్తామంటూ ప్రభుత్వం సమాధానమిచ్చింది. కానీ ఒక్క పైసా చెల్లించిన పాపాన పోలేదు. అప్పటినుండి 1214 అని సర్కులర్ జారీ చేసి సంక్షేమ బోర్డు ఆపాలి భవన నిర్మాణ కార్మికులు ఫేక్ రిజిస్ట్రేషన్ జరిగిందనే నెపంతో బోర్డును ఆపి బోర్డులో ఉన్న సొమ్మును మరికొంత వాడుకున్నారు. అప్పటినుం& భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఎన్నో ఉద్యమాలు నిర్వహించాయి. అయినా ఫలితం లేదు. గత ఏడేళ్ల పోరాట ఫలితంగా ఇటీవల భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని ప్రకటించారు. 2026 మార్చి ఒకటో తేదీ నుండి నాలుగు క్లయిములు ఇస్తామని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఇచ్చిన 12 రకాల సౌకర్యాలను ఎత్తేసి కేవలం సహజ మరణానికి, మట్టి ఖర్చులకు, ఆడబిడ్డ పెళ్లికి భవన నిర్మాణ కార్మికుని భార్యకు కానీ, కూతురుకు కానీ డెలివరీ సమయంలో క్లెయిమ్ ఇస్తామని మాత్రమే చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు ఎంతో మేలు చేశామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోవైపు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఊదరగొడుతున్నారు. అసలు ఇది ఎలా మేలు చేసినట్లు అవుతుందనేది అంతుబట్టని ప్రశ్న. ఉన్న సౌకర్యాలు లాగేసుకుని గొప్పలు చెబుతున్నారు. సంక్షేమ బోర్డులో ఇటీవల కాలంలో సెస్ ద్వారా వచ్చిన డబ్బులు దాదాపు ఇప్పటికే 476 కోట్లు ఉంది. గతంలో బోర్డులో మిగిలి ఉన్న డబ్బు 200కోట్ల పైబడి ఉంది. అంటే మొత్తంగా 676 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వాలు సంక్షేమ బోర్డులో డబ్బులు దారి మళ్ళించకుండా కార్మికుల ప్రయోజనాలకు ఖర్చు చేయాలి. గతంలో ఉన్నట్లుగానే సౌకర్యాలు ఇవ్వాలి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ప్రాజెక్టులు, రోడ్లు, బిల్డింగులు, నిర్మాణాలు జరుగుతున్న సందర్భంలో సెస్సు కలెక్షన్ చేయాలి. ప్రైవేటు గృహ యజమానుల నుంచి , బిల్డర్ల నుండి ఒక్క శాతం సెస్‌ను కచ్చితంగా వసూలు చేయాలి. పారదర్శకత ఉండాలి. జాతీయ స్థాయిలో దుర్వినియోగం అయిన 29 వేల కోట్లు వివిధ రాష్రాల్లో బోర్డులకు జమ చేయాలి. కాగ్ నివేదికను పరిగణలోకి తీసుకొని సంక్షేమ బోర్డులు జాగ్రత్త వహించి నిర్వహించాలి. సెస్ కలెక్షన్ ఒక్క పర్సంటేజ్ నుండి రెండు శాతానికి పెంచాలి. వివిధ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మన రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసి కార్మికులకు న్యాయం చేయాలి. ఈ విధమైనటువంటి విధానాలను రూపొందించుకునేందుకు సంక్షేమ బోర్డు చైర్మన్ సభ్యులు అందరూ కృషి చేయాలి. ఈ రకమైన సౌకర్యాల సాధనకు భవన నిర్మాణ కార్మికవర్గం నిరంతరాయం పరిశీలన ప్రాకారంగా ఉండి జాగ్రత్త వహించాలి.
ఎస్.వెంకటసుబ్బయ్య
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *